
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ది చెంది ఉపాధి, ఆర్థికాభివృద్ది గణనీయంగా పెరుగుతుందని జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. నేడు స్వచ్ఛ సర్వేక్షణ్-2018 పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ చారిత్రక, సాంస్కృతి జనవారసత్వం కలిసిన హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా చేయడం ద్వారా దేశ, విదేశ పర్యాటకుల సంఖ్య పెరిగి తద్వారా నగర ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో గత మూడు సంవత్సరాలుగా చేపట్టిన ఎన్నో వినూత్న స్వచ్ఛ కార్యక్రమాలు భారత ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ స్వీకరించి దేశంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ముఖ్యంగా రెండు డస్ట్ బిన్ల పంపిణీ, స్వచ్ఛ ఆటోల ప్రవేశం, ఇంటింటికి చెత్త సేకరణకు 50రూపాయల వసూలు, ఓపెన్ గార్బెజ్ పాయింట్ల ఎత్తివేత, పారిశుద్ద కార్మికులకు బయోమెట్రిక్ హాజరు విధానం, వార్డులు, కాలనీలకు ఉత్తమ కాలనీలుగా అవార్డుల ప్రధానం తదితర ఎన్నో కార్యక్రమాలను దేశంలోనే అన్ని మున్సిపాలిటీలలో అమలు చేస్తున్నాయని వివరించారు. స్వచ్ఛతపై ప్రతిఒక్కరిలో చైతన్యం తెచ్చేందుకుగాను స్వచ్ఛ *నమస్కారం*, *మనం మారుదాం* అనేవి ప్రవేశపెట్టామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మహిళలకు మరిన్నీ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. నగరంలోని కాలనీలు, నివాస ప్రాంతాల్లో బిన్ లెస్‌గా మారుస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో తమ ఆదాయంలో 24శాతం ఆరోగ్యంపై వ్యయం చేస్తున్నారని, స్వచ్ఛ పాటిస్తే ఈ మొత్తం ఆదా అవుతుందని అన్నారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలలో బ్రిక్‌లు, ఇసుక, ఇటుకల తయారీ ప్లాంట్లు మరో రెండు నెలల్లో సిద్దమవుతాయని వివరించారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకుగాను 45 నర్సరీల ద్వారా 94 రకాల మొక్కలను జీహెచ్ఎంసీ ద్వారా ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. గ్రేటర్లో ఉన్న 1500కిలోమీటర్ల డ్రెయిన్లలో చెత్తను ఇతర వ్యర్థాలను వేయకుండా నగరవాసుల్లో తెచ్చిన అవగాహన, చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు ఉత్పత్తయ్యే చెత్త 3,500 మెట్రిక్ టన్నుల నుండి 4,600 మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలియజేశారు, ప్రచారంలోని అతిపెద్ద పరీక్షస్వచ్ఛ సర్వేక్షణ్- ఫిబ్రవరి మాసంలో జరగనుందని, దీనికి ప్రతిఒక్కరూ సానుకూల జవాబులు అందజేయడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని విజ్ఞఫ్తి చేశారు.