స్వేచ్చకు భాష్యాలు…

అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేస్తున్న నాకు, తన మాదిరిగా వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను, ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్ఛవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్ఛ పట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు, నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.
ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికాస్వేచ్ఛ భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్ఛ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.
నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం, అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ‘ఎడిట్’ చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో ‘పత్రికా స్వేచ్చకు’ పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో, బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదకవర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రాయించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని ‘విషయం’ వారి ‘ఎడిటోరియల్ పాలసీ’కి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల వెంకటేశ్వర రావు గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగా వున్నప్పుడు వారి పత్రికలలో వారి మార్గదర్సకత్వంలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు, ‘ఎడిటోరియల్ పాలసీ’ అంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే పరిమితం కావాలి. కాని, పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం – ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికాస్వేచ్చకు అర్ధమేముంటుంది?
నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక కాలంలో, ఒకానొక ప్రముఖ దినపత్రిక, సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.
“అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవస్తున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.
‘అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు దగ్గరలో ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో టీ తాగుతూ ఎప్పుడు సిద్దంగా వుంటారు.
సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి” – భండారు శ్రీనివాసరావు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *