
కరీంనగర్, ప్రతినిధి : నీతూ కుమారి ప్రసాద్ చాలా స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరుంది.. సంక్షేమ పథకాల్లో పేదలకు న్యాయం జరిగేలా పాలనలో తనదైన ముద్ర వేశారామే. ఇన్నాళ్లు తూర్పు గోదావరి జిల్లాను కలెక్టర్ గా పనిచేసిన ఆమె జిల్లాను అభివృద్ది, సంక్షేమంలో పరుగులు పెట్టించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కుసూటిగా వ్యవహరించే ఆమె ఇప్పుడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా వచ్చారు.
ఐఏఎస్ ల విభజన పూర్తి కావడంతో తెలంగాణకు కేటాయించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా నియమించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఆమె ముక్కుసూటిగా వ్యవహరించారు. స్థానిక మంత్రలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఫైరవీలకు తావివ్వకుండా పాలన సాగించారనే పేరుంది. ఈ నేపథ్యంలో ఆమెను బదిలీ చేయాలని చాలా మంది అక్కడి ప్రజాప్రతినిదులు చూసిన రాష్ట్ర విభజన నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ముఖ్యంగా అక్కడ ఇసుకదందాలు, నాటు సారాలపై ఉక్కుపాదం మోపారు. ఎవరి సిఫార్స్ లకు లొంగకుండా ధైర్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు కరీంనగర్ లాంటి పెద్ద జిల్లా.. కేసీఆర్ కు ఎంతో ఇష్టమైన.. రెవెన్యూపరంగా కీలకమైన కరీంనగర్ జిల్లాను ఆమెకు కేటాయించారు. గతంలో కూడా ఇక్కడ పనిచేసి స్మితా సభర్వాల్ మంచి అధికారిగా పేరుతెచ్చుకుని వెళ్లారు. కరీంనగర్ లో నిరూపించుకుంటే ఐఏఎస్ లు మంచి స్థితికి వెళతారనే పేరుంది. కాబట్టి ఈ సెంటిమెంటును నీతూ కుమారి ప్రసాద్ నిలబెట్టుకుంటారని ఆశిద్దాం..