
కరీంనగర్ :కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన రాపెల్లి మహేశ్, బండియాదాస్వామి, మంథని రమాకాంత్ లు ఈకామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ నే మోసం చేశారు. ఇలా దాదాపు 9 లక్షల మేర నష్టం కలిగించారు. వస్తువులను అమ్ముకొని లాభపడ్డారు. కూపీలాగిన సంస్థ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
నాలుగు నెలల క్రితం మహేశ్ స్నాప్ డీల్ లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే మరో వస్తువును అతడు అందుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది.. మిగతా ఇద్దరితో కలిసి ఇలా ఆర్డర్ చేయడం. మరో వస్తువు వచ్చిందంటూ అబద్ధం చెప్పి చెల్లించిన డబ్బును వెనక్కి తీసుకోవడం పనిగా పెట్టుకున్నారు. అప్పటినుంచి వస్తువులను ఆర్డర్ చేయడం.. పార్శిల్ రాకముందే సంస్థ ప్రతినిదులకు ఫోన్ చేసి మరో వస్తువు వచ్చిందంటూ చెల్లించిన డబ్బును వెనక్కి తీసుకోవడం పనిగా పెట్టుకొని మోసం చేశారు.
ఇప్పటివరకు 63 వస్తువులు దుస్తులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, వంటివి ఆర్డర్ చేసి అవి రాలేదని డబ్బు తీసుకుంటూ రూ.914407మేర మోసం చేశారు.స్నాప్ డీల్ నిర్వాహకులు ఫిర్యాదుతో గోదావరిఖని పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.