
న్యూఢిల్లీ, ప్రతినిధి : స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రచించిన వివాదస్పద పుస్తకం ‘ది రెడ్ శారీ’ భారత మార్కెట్ లో విడుదలైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు. 2010లోనే ఈ పుస్తకాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేద్దామని రచయిత ప్రయత్నించినా అప్పట్లో సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ దీన్ని అడ్డుకుంది. 2008లో ‘ఈ శారీ రోజో’ పేరుతో స్పానిష్ భాషలో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
పుస్తకంలో పలు ఘటనలు..
ఇటలీకి చెందిన సోనియా, రాజీవ్‌గాంధీని వివాహం చేసుకున్న తర్వాత జరిగిన పలు ఘటనలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఇందిరాగాంధీని అంగరక్షకులే కాల్చి చంపడంతో సోనియా భయపడ్డారని..రాజీవ్ గాంధీని ప్రధాని బాధ్యతలు స్వీకరించవద్దని బతిమిలాడినట్లు అందులో తెలిపారు. రాజీవ్‌గాంధీ ప్రధాని బాధ్యతలు స్వీకరించడం.. ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోవడాన్ని సోనియా తట్టుకోలేక పోయారని చెప్పారు. ఒకానొక దశలో ఆమె తన పిల్లలను తీసుకొని ఇటలీకి వెళ్లిపోవాలని అనుకున్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయం ఇటలీ పత్రికల్లో కూడా వచ్చినట్లు చెప్పారు. వీటి ద్వారా సోనియాను ధైర్యంలేని మహిళగా చిత్రీకరించారు. దీంతోపాటు తన తోడికోడలు మేనకాగాంధీతో విభేదాలను సైతం పుస్తకంలో ప్రచురించినట్లు సమాచారం.
మండిపడిన కాంగ్రెస్…
సోనియాగాంధీ గురించి రాసినవాటిలో కొన్ని పూర్తిస్థాయి అబద్దాలని, మరికొన్ని సగం నిజాలని.. పుస్తకం సెన్సేషన్ కావడానికి కొంత ఊహించి రాశారని సోనియా తరపు న్యాయవాది 2010లో రచయితకు లీగల్ నోటీసులు పంపించారు. సోనియాగాంధీ కుటుంబం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. యూపీఏ అధికారంలో ఉండగా.. పబ్లిషర్లు పుస్తకాన్ని విడుదల చేసేందుకు సాహసించలేదు. అయితే ఇప్పుడు రోలీబుక్స్ ప్రచురణ సంస్థ ది రెడ్ శారీ పుస్తకాన్ని మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే స్పెయిన్, ఇటలీల్లో విడుదలైన రెడ్ శారీ పుస్తకాలు 5 లక్షలకుపైగా కాపీలు అమ్ముడయ్యాయి. 445 పేజీలున్న ది రెడ్ శారీ పుస్తకం ఖరీదు 395 రూపాయలుగా ఉంది.