
హైదరాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తున్నందున, ఈ జాబితాను అనుసరించి తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సంబంధిత ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారులకు సమర్పించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణపై నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ సి.ఇ.ఓ చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ కెనడి, జోనల్ కమిషనర్లు భారతి హోలీకేరి, రఘుప్రసాద్‌లతో పాటు ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ 2018 మే 1న ప్రారంభించిన ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే పూర్తయ్యిందని, ఈ సర్వే సందర్భంగా 1,42,909 మంది ఓటర్ల పేర్లు పలు సార్లు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఇంటింటి సర్వే సందర్భంగా 11,974 మంది ఓటర్లు పర్మినెంట్‌గా ఇళ్ల నుండి మారారని గుర్తించడం జరిగిందని, వీరిలో నిబంధనలు అనుసరించి పూర్తి విచారణ నిర్వహించిన అనంతరం 2,732 ఓటర్లను తొలగించడం జరిగిందని తెలిపారు. 2014 నుండి 2018 జూలై మాసం వరకు హైదరాబాద్ జిల్లాలో 1,22,000 మంది మరణించినట్టు రిజిస్టర్ అయిన రికార్డులు తెలియజేస్తున్నాయని, ఈ జాబితాను సంబంధిత ఇ.ఆర్.ఓలకు పంపి వాటిని క్షుణ్ణంగా తనిఖీచేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో గుర్తించిన 6,477 మంది వికలాంగులకు ఓటింగ్ సందర్భంగా తగు సౌకర్యాలను కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై చైతన్యం కల్పించేందుకుగాను ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికిగాను ఇప్పటి వరకు 528 ఓటరు లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేశామని కమిషనర్ వివరించారు. పోలింగ్ కేంద్రాల రేషలైజేషన్ ప్రతిపాదనలను అంసెబ్లీ నియోజకవర్గాల ఇ.ఆర్.ఓలు వ్యక్తిగతంగా పరిశీలించారని, ఈ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను గుర్తింపు, రిజిస్టార్డ్ అయిన రాజకీయ పార్టీలకు అందించి వారి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా పలు పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు.