సుప్రజ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా మళ్లీ చూశా..

– పైసల కోసం ఆసుపత్రిలో హంగామా
-స్పెషలిస్టుల పేరుతో మోసం చేసిన ఆస్పత్రి వైద్యులు
– ఒక ఇంజక్షన్, ఒక సైలెన్ కు 7500 బిల్లు..
-వైద్యం పేరుతో జనం జేబులకు చిల్లు పెడుతున్న ఆస్పత్రి
-మాజీ మంత్రి అల్లుడీ ఆస్పత్రి తీరిది..

(అయిులు రమేశ్,)
‘ఠాగూర్ సినిమా మళ్లీ చూశా.. హైదరాబాద్ లోని నాగోల్ ఎక్స్ రోడ్ లోని సుప్రజ ఆసుపత్రి వైద్యులు నాకు ఈ సినిమా చూపించారు. పైసల కోసం ఆసుపత్రిలో హంగామా,
స్పెషలిస్టుల పేరుతో మోసం చేస్తున్నఆస్పత్రి వైద్యులు, ఒక ఇంజక్షన్, ఒక సైలెన్ కు 7500 బిల్లు..వేసి చేతిలో పెట్టారు. ఆశ్చర్యపోయాను ఇంత మోసమా..అని.
నేనో సీనియర్ జర్నలిస్టును.. నాకే ఇలా జరిగింది. ఇక సామాన్యజనం బతుకు ఎంతో దుర్భరమో చెప్పడానికి మాటలు చాలట్లేదు.. వైద్యం పేరుతో సాగుతున్న ఈ దందాలో అందరం (నాతో సహా) సమిధలవుతున్నామంటే రాష్ట్రంలో వైద్యరంగం ఎంత దుర్భర స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..’

రోగుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. సంవత్సరం కష్టపడి సంపాదించిందంతా ఒక్కరోజు ఆస్పత్రిలో కరిగేస్తున్నారు. పోవడానికి గవర్నమెంట్ ఆస్పత్రుల్లో వసతులు లేవు.. బతకడం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే రోగం ఉన్నా.. లేకున్నా.. బతికున్నా.. చచ్చినా కూడా పైసల కోసం పీనుగులకు పీక్కుతినే పరిస్తితి దాపురిస్తోంది…

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి బిల్లు చూసి ఒళ్లు, ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. జర్నలిస్టునైనా నన్నే ఓ ఆస్పత్రి వాళ్లు మోసం చేసి వేల రూపాయల బిల్లు కట్టించుకున్నారు. కిడ్నీలో చిన్న నొప్పి వస్తే చూపించుకున్నందుకు 7500 బిల్లు వేశారు. ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి, ఒక సెలైన్ ఎక్కించి ఇంత పెద్ద మొత్తం(7500) నా చేతుల్లో పెట్టారు. ఇంత బిల్లు ఏంటని ప్రశ్నిస్తే.. దురుసుగా సమాధానమిచ్చారు. చివరకు రూ.4500 కడితే కాని వెళ్లనివ్వలేదు..

నొప్పి తగ్గకపోతే వేరే ఆస్పత్రికి షిప్ట్ అయ్యాను. అక్కడికి వెళితే 700 రూపాయలు మాత్రమే ఖర్చు అయి నొప్పి తగ్గిపోయింది.. మూత్రంలో చిన్న రాయి అడ్డు వచ్చిందని.. నీళ్లు తాగితే పోతుందని వారు సమాధానం ఇచ్చారు. ఇంత చిన్న జబ్బుకు అంతపెద్ద మొత్తం వసూలు చేసిన ఆ ఆస్పత్రి ఆగడాలు నిజంగా నన్ను విస్మయానికి గురిచేశాయి.

వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని నాగోల్ ఎక్స్ రోడ్ లోని సుప్రజ ఆసుపత్రి.. శనివారం వాహనంలో వెళుతుండగా చిన్నగా కిడ్నీల్లో నొప్పివచ్చింది. దగ్గర్లో ఉన్న సుప్రజ ఆసుపత్రికి వెళ్లాను. కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నాడా అని అడిగా.. ఉన్నాడన్నారు. గంటసేపైనా ఆ స్పెషలిస్ట్ రాలేదు.. నన్ను ఆ టెస్ట్ లు.. ఈ టెస్ట్ లు అంటూ ‘ఠాగూర్ సినిమాలోలా అటూ ఇటూ స్కానింగ్ లకు తిప్పారు’. చివరకు ఏదో డ్యూటీ డాక్టర్ వచ్చి ‘ ఒక పెయిన్ కిల్లర్, ఒక గ్లూకోజ్ పెట్టాడు’. మీ కిడ్నీ వాచిందని ఓ సారి అన్నారు. కిడ్నీలో రాళ్లు వచ్చాయని రేపు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకోసారి ఇంకోలా ఇలా నా బతుకు మీద ఆశలేకుండా మాట్లాడారు ఆ డాక్టర్లు.. అవన్నీ విన్న నాకు నిజంగా భయమేసింది. అక్కడే ఉండి ఉంటే నాకు ఈ పాటికి కిడ్నీ ఆపరేషన్ అయ్యుండేది..

చివరకు భయమేసి కిడ్నీ డాక్టర్ ఏడంటూ గట్టిగా అడిగాను.. మా దగ్గర కిడ్నీ స్పెషలిస్ట్ లేడని ఆస్పత్రి వైద్యులు సమాధాన మిచ్చారు. తాను వేరో ఆస్పత్రికి వెళతానని బిల్లు ఇవ్వమని అడిగా.. ఓ 7500 బిల్లు రాసి నా చేతిలో పెట్టారు. నొప్పి తగ్గింది లేదు.. కానీ బిల్లు చూసేసరికి నా గుండె జల్లుమంది. ఒక ఇంజక్షన్, సెలైన్ కు ఇంత బిల్లా అని ఆశ్చర్యపోవడం నా వంతైంది.

ఒక జర్నలిస్టుకైనా నాపట్లే ఆస్పత్రి ఇంత ఘోరంగా వ్యవహరిస్తే..ఇక సామన్యుల రోదన అరణ్య రోదనే అని అర్థం అయ్యింది. మొత్తానికి చివరకు 4500 రూపాయలు చెల్లించి ఆ ఆస్పత్రి నుంచి బయటపడ్డా.. కరీంనగర్ లోని వేరే ఆస్పత్రికి వెళితే.. వేసవి వేడికి నీళ్లు తాగకపోవడంతో ఇలా అయ్యిందని.. నీళ్లు బాగా తాగాలని కొన్ని టెస్టులు చేసి మందులిచ్చారు. ఇక్కడ చెల్లించింది 700 మాత్రమే.. ఆ ఆస్పత్రికి.. ఈ ఆస్పత్రికి ఎంత తేడా అనిపించింది. ఆ ఆస్పత్రి దోపిడీ దారుల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ ఆస్పత్రి ఎవరిదంటూ ఆరాతీయగా మాజీ మంత్రి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అల్లుడిదీ అని తేలింది. ఎంతైనా రాజకీయ నాయకుడిది కదా.. అందుకే పలుకుబడితో జనాన్ని దోచేస్తున్నా.. మన అధికారులు పట్టించుకోవడం లేదని అవగతమైంది.

మనుషుల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న ఇటువంటి ఆస్పత్రులు ఉన్నంత కాలం జనం బతుకు గాలిలో దీపమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *