సీఎల్ రాజం, విజయక్రాంతి పత్రికపై పరువు నష్టం దావా: మంథని ఎమ్మెల్యే పుట్ట మధు

-మాజీ మంత్రితో కుమ్మక్కు
-కుట్రలో భాగంగానే ఆరోపణలు
-మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్
-విజయక్రాంతి కథనంపై ఆగ్రహం
విజయక్రాంతి పత్రికపైనా, ఎండీ సీఎల్ రాజంపైనా పరువు నష్టం దావా వేయనున్నట్లు మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తెలిపారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను 909 కోట్ల రూపాయలు సంపాదించానని విజయక్రాంతిలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పత్రిక ఎండీ సీఎల్ రాజంకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు చెప్పారు.  మాజీ మంత్రితో విజయక్రాంతి ప్రతిక ఎండీ కుమ్మక్కయ్యారని, కుట్రలో భాగంగానే తనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని  ఆరోపించారు. రాష్ట్ర్రంలో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన సీఎల్ రాజం మంథనిలో కాంగ్రెస్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు ఎమ్మల్యేగా ఉండడాన్ని ఎందుకు ఓర్వ లేకపోతున్నారో  సీఎల్ రాజం సమాధానం చెప్పాలన్నారు. సీఎల్ రాజం  డైరెక్టర్ గా ఉన్న  సీవ్ కన్ స్ట్ర్రక్షన్స్ కింద   మధ్యప్రదేశ్ లో  అనేక కాంట్రాక్టులు తీసుకున్నారని, అక్కడి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చిన సంగతి భారత దేశమంతా తెలుసని అన్నారు. మామూలు ప్రవాస వంటదారిడి కూమారుడైన సీఎల్ రాజం ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్ర్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కేవీపీ రాంచందర్ రావు కు ఏజెంట్ గా ఉన్నారని, ఎవరెవరికి ప్రాజెక్టులు కేటాయించాలో ఆయన చేతుల మీదుగానే జరిగేదని తెలిపారు.  ఆ తర్వాత అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఏజెంట్ గా వ్యవహరించారన్నారు.  గతంలో కూడా కొంత మంది తమపై ఇలాంటి కేసులు వేస్తే   హై కోర్టు గుణపాఠం చెప్పిందని, సీఎల్ రాజంకు అదే పరిస్థతి ఎదురవుతుందని అన్నారు.   టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనం చేసేందుకు కుట్ర పన్నారన్నారు. మంథనిలో అసాంఘిక శక్తులు రాజ్యమేలేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. కొంతమంది  ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,  అలాంటి వారందరినీ గుర్తించి చట్టం ఎదుట దోషులుగా నిలబెడతామని చెప్పారు.  పత్రిక పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇటీవల చిట్ ఫండ్ సంస్థ నుంచి కూడా డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.   ప్రస్తతం మంథనిలో నాయకుల పాలన లేదని, ప్రజలు స్వచ్ఛందంగా పాలించుకుంటున్నారని అన్నారు. అధికారం పోయే సరికి నాయకులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్నారని మండిపడ్డారు. విజయక్రాంతి మంథనిలో కాంగ్రెస్ కు ఏజెంట్ గా వ్యవహరిస్తోందని,  మాజీ మంత్రి కనుసన్నల్లో  పనిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర్రంలో బీజేపీకి మద్దతు తెలుపుతున్న విజయక్రాంతి  మంథనిలో కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతుందనడానికి ఇలాంటి అసత్య ఆరోపణలే నిదర్శనమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *