
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహాత్మగాంధీ-నెల్సన్ మండేలా సిరిస్ తారస్థాయి ఉత్కంఠను రేపుతోంది. సిరిస్ ఇప్పటికే 2-2తో సమానంగా ఉండటంతో రేపు ముంబయిలో జరగబోయే మ్యాచ్ కీలకంగా మారనుంది. రేపు వాంఖడే స్టేడియంలో జరగబోయే ఐదో వన్డేలో విజయం సాధించి వన్డే సిరిస్ సొంతం చేసుకోవాలని టీమిండియా గట్టిగానే ప్రయత్నిస్తుంది. కోహ్లీ, రైనాలు ఫాంలోకి రావడం కూడా టీమిండియాకు కలిసొచ్చే అంశం. అలాగే ధోనీ, రోహిత్ శర్మ, రహానే కూడా హాఫ్ సెంచరీలతో రాణిస్తుండగా ఓపెనర్ ధావన్ కూడా ఫాంలోకి వస్తే వన్డే సిరిస్ ను కైవసం చేసుకునేందుకు మార్గం మరింత సుగమం అవుతుంది. అటు బౌలింగ్ కూడా సౌతాఫ్రికాను కాస్త ఇబ్బందికి గురిచేసే అంశం. భారత స్టేడియాలలో స్పిన్నర్లు చక్కగా బంతిని తిప్పుతూ సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లను ముప్పుతిప్పలకు గురి చేస్తున్నారు. అయితే వాంఖడే మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని సౌతాఫ్రికా కూడా గట్టి ప్రయత్నమే చేస్తుంది. అయితే సౌతాఫ్రికా ఆటగాళ్లు గాయాలపాలవ్వడం ఒకింత కలవరానికి గురిచేస్తున్న అంశం. భారత స్పిన్ ను ఎలాగైనా ఎదుర్కొని ఎలాగైనా సిరిస్ గెలవాలని సఫారీ జట్టు యోచిస్తోంది.