సిరిసిల్ల చేనేతకు తీరనున్న కష్టాలు

-తమిళనాడు చీరల పథకంతో చేనేతలకు చేతినిండా పని
కరీంనగర్ , ప్రతినిధి : సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమకు చరిత్రలో గతమెన్నడూ లేనివిధంగా మంచిరోజులు వచ్చాయి. కార్మికుల మోములో ఎప్పుడూ చూడని సంతోషం వెల్లివిరుస్తోంది. చేతినిండా పని దొరకడంతో నేతన్నలు సంబరపడిపోతున్నారు. తమిళనాడులో ప్రవేశపెట్టిన ‘చీర – ధోవతి’ పథకం తమ కష్టాలు గట్టెక్కాలా చేస్తున్నాయని సంతోషపడుతున్నారు.

కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యం…
కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో  చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యం. చేసేందుకు పనిలేక.. వచ్చే డబ్బులతో ఇల్లు గడవక.. చేసిన అప్పులు తీర్చలేక నేతన్నలు పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. కానీ ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. మూస పద్ధతిలో, మారని డిజైన్‌లతో.. మార్కెటింగ్‌ సౌకర్యంలేని సమస్యల వలయంలో చిక్కుకున్న సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

తమిళనాడులో పేద మహిళలకు ఉచితంగా చీరలు
తమిళనాడులో నిరుపేద మహిళలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పాలికాటన్‌ చీరలు సిరిసిల్ల నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో ఎక్కడ చూసినా మరమగ్గాలపై తమిళనాడు చీరల తయారీయే కనిపిస్తోంది. పాలిస్టర్‌, కాటన్‌ దారం సమ్మిళితంగా పాలికాటన్‌ పేరుతో చీరలు తయారవుతున్నాయి. చీరల తయారీ ఆర్డర్‌ను తమిళనాడులోని ఒక ప్రైవేట్‌ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది. ఆ ఏజెన్సీ చీరల తయారీకి తెలంగాణలోని సిరిసిల్లను ఎంచుకుంది.

కోటి 73 లక్షల చీరలు
ప్రతి ఏటా తమిళనాడులో పొంగల్‌ రోజున కోటి 73 లక్షల చీరలను, కోటి 72 లక్షల ధోవతీలను నిరుపేదలకు పంచడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంత పెద్ద ఆర్డర్‌ను తమిళనాడులోని కొన్ని మరమగ్గాల కేంద్రాలకు అందిస్తూనే మరికొన్నింటిని సిరిసిల్లలోని మరమగ్గాల కేంద్రాలకు అప్పగించారు. దీంతో సిరిసిల్లలో ఎక్కడా చూసినా తమిళనాడు చీరల తయారీయే దర్శనమిస్తోంది. తాము తయారు చేసే వస్త్రాల కన్నా వీటిపై ఎక్కువ ఆదాయం రావడంతో అందరూ వీటి తయారీపైనే దృష్టి కేంద్రీకరించారు. ఇది నిరంతర ప్రక్రియగా మారితే ఏడాది పొడవునా ఉపాధికి డోకా లేదని కార్మికులంటున్నారు.

యూనిఫామ్స్‌ తయారీకి కేంద్రంగా..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపయోగించే యూనిఫామ్స్‌ తయారీకి సిరిసిల్ల కేంద్రంగా చేసుకుంటే పూర్వ కళ సంతరించుకుంటుందని చేనేత కార్మికులు భావిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఆర్డర్లతో ప్రస్తుతానికి కాలం గడుస్తున్నా.. భవిష్యత్‌లో తమ ఉపాధికి ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేతన్నలు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.