
కరీంనగర్: 2015-16 సంవత్సరంలో క్రూసియల్ బ్యాలెన్స్ ఫండ్ (సిబిఎఫ్) క్రింద చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో సిబిఎఫ్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయితి భవనాలు, అంగన్ వాడి కేంద్ర భవనాలు, వ్యవసాయ గోడౌన్లు, విద్యా సంస్దల కాంపౌండ్ వాల్ లు, కమ్యూనిటి భవనాల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు సిబిఎఫ్ క్రింద చేపట్టినట్లు అన్నారు. 2015-16 సంవత్సరంలో 177 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 77 పనులు పూర్తికాగా, 100 పనులు వివిధ దశల్లో వున్నాయన్నారు. రూ. 500.89 లక్షల అంచనాలతో పనులు చేపట్టగా ఇప్పటి వరకు రూ. 339.90 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. పనులు పూర్తికాక స్దల సమస్యలు వున్న చోట రద్దుచేసి, స్ధల లభ్యం వున్నచోటకు పనులు మార్చాలని, భవనాలు లేని గ్రామ పంచాయితీలు, శిధిలావస్దలో వున్న గ్రామ పంచాయితీ భవనాల స్ధానంలో క్రొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో టాయిలెట్ల వసతి,
తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మోడల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్ వో ప్లాంట్లు వినియోగంలోకి తెచ్చిన మీదటనే నిధులు చెల్లించాలన్నారు. 2016-17 సంవత్సరానికి నూతన పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాల్సివున్నందున గత సంవత్సర పనులపై వ్యక్తిగత శ్రద్ద వహించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, డ్వామా పిడి వైవి. గణేష్, డిఆర్ డిఏ పిడి అరుణశ్రీ, పంచాయితిరాజ్ ఎస్ ఇ దశరధం, జిల్లా సహకార అధికారి అంబయ్య, పంచాయితిరాజ్, ఆర్అండ్ బి, ఆర్ డబ్ల్యుఎస్ ఇఇ లు తదితరులు పాల్గొన్నారు.