
కరీంనగర్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సినిమా ధియేటర్ లలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రేట్ పరిధిలోని సినిమాహళ్ళ యజమానులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సినిమా ధియేటర్లలో జాతీయగీతం ఆలాపనకు సంబంధించి పూర్తి నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. కమీషనరేట్ పరిధిలోని సినిమా ధియేటర్ల యజమానులతో గురువారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ అసాంఘీకశక్తులు జనం ఎక్కువుగా జమకూడే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని
సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సినిమాహళ్ళ ప్రవేశ, బయటకు వెళ్ళే, పార్కింగ్ ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రవేశ ద్వారాల ద్వారా డోర్ ఫ్రేమ్, హ్యండ్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలను చేపట్టాలని సూచించారు. వినోదం కోసం వచ్చే ప్రజలకు కనీస భద్రతను కల్పించాల్సిన బాధ్యత సినిమాహళ్ళ యజమానులపై ఉందని చెప్పారు. ప్రతి ఆటకు ఆటకు మధ్యలో హల్ ను శుభ్రపరచాలని, పరిసరాలను ఉంచాలని తెలిపారు. 15రోజుల వ్యవధిలో సిసి కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని గడువు విధించారు. ఎలాంటి వాతావరణ పరిస్ధితుల్లో అయినా పనిచేసే నాణ్యత ప్రమాణాలతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయాలని, నెల రోజులపాటు నిడివి ఉండేలా సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రమాదాలు సంభవించిన సందర్భాలలో సత్వరం రక్షణ చర్యలు చేపట్టేందుకు సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని తెలిపారు. సినిమాహళ్ళ నిర్వాహణకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ సిపి టి.అన్నపూర్ణ, ఎసిపి జె,రామారావు, ఆర్.ఐ గంగాధర్, అడ్డినిస్ట్ర్రేటివ్ అధికారి శ్రినావాస్ తదితరులు పాల్గొన్నారు.