
మే చివరి కల్లా నిర్మాణ పనులు ప్రారంభం
యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియామకం
వేగంగా మౌలిక, క్లినికల్, సర్జికల్ సదుపాయాలు
సిద్దిపేట వైద్య కళాశాల ఏర్పాటుపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిల సమీక్ష
హైదరాబాద్ ః మే చివరి కల్లా సిద్దిపేట వైద్య కళాశాల నిర్మాణ పనులు మెదలవ్వాలని, యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియామకం పూర్తి చేయాలని మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలు వైద్య, ఆరోగ్యశాఖ, రెవిన్యూ అధికారలని ఆదేశించారు. 300 పడకలుగా తీర్చిదిద్దుతున్న ఏరియా హాస్పిటల్లో క్లీనికల్, సర్జికల్, మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
నూతనంగా సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న సిద్దిపేట వైద్య కళాశాల పనుల పురోగతి మీద భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసన సభావ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డిలు శనివారం సచివాలయంలోని వైద్యశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. మే చివరి నెల కల్లా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గుర్తించిన స్థలంలో సిద్దిపేటలోని వైద్యకళాశాల స్థలంలో శంకుస్థాపన జరిగే విధంగా ఏర్పాట్లు జరగాలని మంత్రులిద్దరూ అధికారులని ఆదేశించారు. ఈ లోగా అందుకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకి సూచించారు. మానవ వనరుల నియామకానికి అనుమతులు వచ్చినందున యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేయాలన్నారు. ఇక ఇప్పటికే ఏరియా హాస్పిటల్ని 300 పడకల వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేసినందున, మెడికల్ కాలేజీకి అనుబంధంగా టీచింగ్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దే పనులు మరింత వేగంగా పూర్తవ్వాలన్నారు. ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, వైద్య పరీక్షల పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరికరాలు, వివిధ విభాగాల వారీగా చేయాల్సిన అభివృద్ధిని పూర్తి చేయాలని మంత్రులు అధికారులకు చెప్పారు. మెడికల్ కాలేజీని అటానమస్‌గా తీర్చిదిద్దే విషయమై కూడా మంత్రులు అధికారులతో చర్చించారు. కాగా, సిద్దిపేట మెడికల్ కాలేజీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, మంచి పరిపాలనా కాలేజీగా రూపొందించాలని మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి అధికారులకి తెలిపారు.
ఈ సమీక్షలో మంత్రులతోపాటు వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఇ రమణి, టిఎస్ఎంఎస్ ఐడిసి ఎండి వేణుగోపాల్, సిఇ లక్ష్మణ్‌రెడ్డి, సిద్దిపేట మెడికల్ కాలేజీ స్పెషల్ ఆఫీసర్ విమళా థామస్, ప్రిన్సిపల్ తమిళ అరసి, సిద్దిపేట డిఎం అండ్ హెచ్ఓ, వైద్యశాల సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.