
గుంటూరు, ప్రతినిధి : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ బృందం గుంటూరు జిల్లాకు వచ్చేసింది. వారు ఎప్పుడు వచ్చారో..పర్యటన షెడ్యూల్ ను ఏపీ అధికారులు రహస్యంగా ఉంచారు. మొత్తం ఐదుగురితో కూడిన సాంకేతిక బృందం గుంటూరు జిల్లాలో వాలిపోయింది.
సాంస్కృతిక..వాణిజ్య..కీలక ప్రదేశాల్లో వీరు పర్యటన చేశారు. శుక్రవారం తుళ్లూరులో పర్యటించిన ఈ సాంకేతిక బృందం రాత్రి అమరావతిలోని బుద్ధ ప్రాజెక్టును సందర్శించింది. అనంతరం శనివారం ఉదయం రైల్వే స్టేషన్ ను సందర్శించి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తరువాత ఆసియాలో పెద్దదిగా పేరు గాంచిన మిర్చియార్డును సందర్శించారు. వీరి పర్యటనను రహస్యంగా ఉంచడం వెనుక మతలబు ఏంటో తెలియడం లేదు.
ఆర్డీఓ భాస్కర నాయుడు దగ్గరుండి వారి షెడ్యూల్ ను చూస్తున్నారు.
ఈనెల 13వ తేదీ వరకు సింగపూర్ సాంకేతిక బృందం మకాం వేయనుంది. ఇప్పటికే నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూ సేకరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడకు రానున్నారు. ఆయన వచ్చిన తరువాత తాము జరిపిన పరిశీలన అంశాలను మంత్రి ఈశ్వరన్ కు సాంకేతిక బృందం వివరించనుంది.