
పదవీకాలం ముగుస్తున్న ప్రాధమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్రం సహకార బ్యాంకులు, జిల్లా కేంద్రం మార్కెటింగ్ సంఘాలు, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (TSCAB) పాలకవర్గ కమిటీ సభ్యులను ఆరు నెలల పాటు పర్సన్ ఇంచార్జీలుగా నియమించాలని నిర్ణయించామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఈరోజు సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం సహకార సంఘాలలో 456 సంఘాల పదవీకాలం ఈనెలాఖరుతో ముగీయగా, 427 సంఘాల పదవీకాలం ఫిబ్రవరి 3 తో ముగుస్తుంది. మిగతా సహకార సంస్థల పదవీకాలాలు కూడా ముగుస్తున్నాయి. ఈ అశంపై చర్చించటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ టి. హరీష్ రావు, ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి లతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని D బ్లాక్ లో సమావేశమయింది. ఆరు నెలలలోగా మరోసారి సమావేశమయ్యి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో TSCAB చైర్మన్ కొండూరి రవీందర్ రావు, వ్యవసాయ శాఖ సెక్రటరీ సి. పార్ధసారది -IAS, వీరబ్రహ్మం IAS- CCRCS, నేతి మురళి MD- TSCAB, అధికారులు పాల్గొన్నారు.