
కరీంనగర్: సహకార రంగం విస్తరిస్తే గ్రామాలు అభివృద్ది చెందుతాయని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రువారం రోజున మానకొండూర్ శాసన సభ నియోజక వర్గంలోని లక్ష్మీపూర్, ఊటూరు గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. లక్ష్మీపూర్ లో ఎస్పీ కుంటలో మిషన్ కాకతీయ పనులు, పెద్దమ్మ గుడిలో పూజలు, త్రాగునీటి పైప్ లైన్, ప్రాధమిక సహకార సంఘం పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం, మొక్కలు నాటడం, విత్తన శుద్ది ప్లాంట్ నిర్మాణానికి శంకుస్ధాపన, స్ట్ర్రాంగ్ రూం విత్తన శుద్ది ప్లాంటేషన్ వంటి కార్యక్రమాల్లో మంత్రి, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, ఎం.పి. వినోద్ కుమార్, జెడ్పిటిసి సుగుణాకర్, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో పూర్వ వైభవం రావాలని, రైతుల అవసరాలకు సహకార సంఘాలు ఆర్ధికంగా అందుకుంటున్నాయని అన్నారు. రానున్న కాలంలో కరీంనగర్ జిల్లాలో రెండు పంటలకు సాగు నీరందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. సహకార సంఘాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఎం.పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రాధమిక సహకార సంఘాలు ఆర్ధికంగా లాభాలు గడిస్తున్నాయని, సొసైటీలు రైతులకు రుణాలు, ఎరువులు అందిస్తున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా సహకార సంఘాల పనితీరుపై చర్చ జరుగుతున్నాయని అన్నారు. పత్తి పంటను కొంత మేర తగ్గించాలని, ప్రపంచ మార్కెట్ లో మద్దతు ధరలేని నేపధ్యంలో రైతులకు సూచిస్తున్నామన్నారు. కరీంనగర్ పాల డైరీ లాభాల బాటలో ఉందని, రెండు లక్షల లీటర్ల సేకరణ జరుగుతుందన్నారు. శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర్రంలో రైతులు అనేక కష్టాలు
ఎదుర్కొన్నారని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ గోదాం నిర్మాణానికి ఆయన సూచన ప్రాయంగా మంజూరు చేస్తానన్నారు. కెడిసిసి అధ్యక్షులు కె.రవీందర్ రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 12 సంఘాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని, 127 సంఘాలు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. 48 కోట్లతో వ్యాపారం గడిస్తే 50 లక్షల రూపాయల లాబం ఆర్జించామన్నారు. రానున్న కాలంలో జిల్లాలో 162 మైక్రో ఎ.టి.ఎం.లను ఏర్పాటు చేస్తామని, బంగారం పై రుణాలు, సేఫ్ లాకర్ లను ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. అనంతరం సంఘంలో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన ఇద్దరికి డిపాజిట్ సర్టిఫికెట్స్, ఇద్దరికి లాంగ్ టర్మ్ రుణాలను మంత్రి అందించారు.