
ఇంతకాలం తమ మీద రాళ్లు విసిరిన వాళ్ల ప్రాణాలను కాపాడటానికి, ఆ సైనికులు ఏ మాత్రం సంకోచించడం లేదు. వరదలతో విలవిల్లాడుతున్న సుందర కాశ్మీర్లో ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సైనికులు యుద్ధ ప్రాతిపదికన కాపాడుతున్నారు.
సాధారణంగా కాశ్మీర్ ప్రజల్లో చాలా మందిపై వేర్పాటు వాదుల ప్రభావం ఎక్కువ. కాబట్టి తరచూ నిరసనలు, ధర్నాలు చేస్తుంటారు. పోలీసులపైనా సైనికులపైనా రాళ్లు రువ్వుతుంటారు. ఇప్పుడు వరదల్లో ప్రజలను కాపాడటానికి సైనికులు రాత్రీ పగలూ శ్రమిస్తున్నారు. ఇన్నాళ్లూ తాము వ్యతిరేకించి, రాళ్లు రువ్విన వారే ఆదుకోవడం చూసి కాశ్మీరీలు చలించి పోతున్నారు. సైనికుల సేవా భావానికి సలాం చేస్తున్నారు.
కాశ్మీర్లో ఎప్పుడూ భయం భయం వాతావరణమే. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియదు. అందుకే సైనిక బలగాలు సదా అప్రమత్తంగా ఉంటాయి. వేర్పాటు వాదుల ప్రభావంతో ప్రజలు అల్లర్లకు పాల్పడితే అడ్డుకుంటాయి. ఆ ప్రయత్నంలో సైనికులు రాళ్ల దాడిని ఎదుర్కొంటారు. అయినా సంయమనం పాటిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇప్పుడు వరదల్లో తమను కాపాడటానికి సైన్యం వచ్చిందే తప్ప, వేర్పాటు వాదుల జాడ లేదని ప్రజలకు అర్థమవుతోంది. వెనకుండి తమను ఎగదోసి, ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు చేయించిన వేర్పాటు వాదులు ఇప్పుడు అడ్రస్ లేరు. వరదల్లో చిక్కుకున్న ఈ విపత్కర సమయంలో మేమున్నామంటూ వేర్పాలు వాదులు ఎందుకు ముందుకు రావడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి ఆర్మీ, వాయుసేన సైనికులు కాశ్మీరీ ప్రజల మనుసును గెలిచారు.