సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు?

ఇక జరగబోయేది యుద్ధమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మంచి చెడుల విచక్షణ అణుమాత్రమైనా లేని పాకిస్తాన్ కు మాటలు అర్థం కావు. ఇప్పటికే మోర్టార్ల మోతతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. పౌరులను కూడా పాపిష్టి పాక్ సైన్యం టార్గెట్ చేస్తోంది. భారత్ లోకి చొరబడటానికి సిద్దంగా ఉన్న ఉగ్రవాదులకు లైన్ క్లియర్ చేయడానికి పాక్ సైన్యం మన భద్రతా దళాలపై కాల్పులకు దిగుతోంది. పోర్ బందర్ సమీపంలో ఉగ్ర వాదుల పడవ పేల్చివేత మామూలు ఘటన కాదు. మరో ముంబై ముట్టడి మారణకాండకు పాక్ ప్లాన్ చేసిందని దీంతో స్పష్టమైంది.

భారత్ రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా బరాక్ ఒబామాను ఆహ్వానించిప్పటి నుంచీ పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు కల్లు తాగిన కోతిలా చిందులేస్తున్నాయి. ఒబామా వచ్చే లోగా భారత్ లో దాడులు చేయడానికి పిచ్చి పట్టినట్టు ప్రయత్నిస్తున్నాయి. భారత్ నిఘా సంస్థలు, భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో ముష్కరులకు అవకాశం చిక్కలేదు. బెంగళూరులో మాత్రం చిన్నపాటి కలకలం రేపగలిగారు. ఇప్పుడు సరిహద్దుల్లో పాక్ సైన్యం పదే పదే కాల్పులు జరపడానికి కారణం… అటు వైపు నుంచి ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడం. రిపబ్లిక్ డే ను టార్గెట్ చేసుకుని హింసకు పాల్పడటం. అయితే భారత్ బలగాలు దీటుగా స్పందిస్తున్నాయి.

పాక్ తీరు చూస్తుంటే తాను నాశనమైనా ఏదో ఒక దుష్టచర్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. రిపబ్లిక్ డే ను టార్గెట్ చేసుకుని భారీ విధ్వంసాలు చేయడం, లేదా సరిహద్దుల్లో మన సైనికులు వీలైనంత మందిని పొట్టనపెట్టుకోవడం పాక్ వ్యూహం కావచ్చు. అదే జరిగితే అది చిన్న పాటి యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. భారత బలగాల సహనం నశించి, దాడికి తెగబడితే ఎలా ఉంటుందో పాక్ ఇప్పడికే నాలుగుసార్లు చవి చూసింది. మూడు యుద్ధాల్లో, ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో బారత బలగాల దెబ్బ రుచి ఎలా ఉంటుందో పాక్ సైన్యానికి అర్థమైంది. కానీ మూర్ఖుడికి విచక్షణ ఉండదు. ఆయుధాలు అనేవి పిచ్చి వాడి చేతిలో రాయిలా మారడంతో పాక్ బలగాలు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయి.

పాక్ వైఖరి ఇలాగే కొనసాగితే… భారత బలగాలు పెద్ద ఎత్తున సరిహద్దుల్లో విరుచుకు పడ్డా ఆశ్చర్యం లేదు. మన సరిహద్దులను కాపాడుకోవడానికి మన సైన్యం పూర్తి స్థాయిలో దాడి అంటూ మొదలు పెడితే రోజులు అవసరం లేదు. కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లోని పాక్ సైనికులను నేలకూల్చ వచ్చు. బహుశా అలా జరిగే వరకూ పాక్ తీరు మారదేమో.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.