సమిష్టి బాధ్యతతో తెలంగాణకు హరితహరం కార్యక్రమం

కరీంనగర్: తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి బాధ్యతతో విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. బుధవారం సిరిసిల్ల డివిజన్ పరిధిలోని సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులకు తెలంగాణ హరితహరం అవగాహన కార్యక్రమం ఆర్యవైశ్య వాసవి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నాటిన మొక్కలకు మేంటనెన్స్ క్రింద ఎన్.ఆర్.ఇ.జి., స్ధానిక గ్రామ పంచాయితీ నిధుల నుండి సమకూర్చుకోవాలని సూచించారు. స్ధానిక సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములై కార్యక్రమాన్నివిజయవంతం చేయవచ్చన్నారు. సిరిసిల్ల డివిజన్ లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, పన్ను వసూళ్లు, అక్షరాస్యత కార్యక్రమాలు రాష్ట్ర్రంలోనే మొదటి స్ధానంలో ఉందని, అదే స్పూర్తితో తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో కూడా కరీంనగర్ జిల్లాకు ప్రధమ స్ధానం నిలపాలని అన్నారు. నియోజక వర్గాలు, డివిజన్, మండలాలు, గ్రామాల వారిగా ప్రత్యేకాధికారులను నియమించడం జరిగిందన్నారు. హరిత రక్షణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని అటవీశాఖాధికారులను ఆమె ఆదేశించారు. గతంలోని అనుభవాల దృష్ట్యా కానుగ మొక్కలను నాటాలని సూచించారు. ప్రజలకు అవసరమయ్యే నీడనిచ్చే, పండ్లు, పూల నిచ్చే మొక్కలు ఆయా నర్సరీల్లో ఉన్నాయన్నారు. డంపింగ్ యార్డ్స్, స్మశానవాటికలు, వాగులు, గుట్ట ప్రాంతాలల్లో, పొలంగట్లు, రహదారులకు ఇరువైపుల పెద్ద ఎత్తున మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. ఏయే నర్సరీల్లో ఏయే మొక్కలు ఉన్నాయో సర్పంచులకు డైరక్టరీలను ఇవ్వడం జరుగుతుందన్నారు. క్వారీలల్లో ఆయా యజమానులు మొక్కలు నాటేందుకు భూగర్భ శాఖాధికారులు పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, తన చిన్ననాడు గ్రామాల్లో వెళ్లాలంటే గ్రామం చుట్టూ చెట్లతో ఉండేవని గుర్తుచేశారు. భావితరాల వారికి చెట్లను అందించడానికి ఈనాడు మనం మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కెడిసిసి అధ్యక్షులు రవీందర్ రావు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులు పెంచాలి – వానలు వాపస్ రావాలని అదే నినాదంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర్రంలోని 900 సొసైటీల్లో మొక్కలు నాటడం, ఇంకుడు గుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు, జిల్లాలోని 134 సొసైటీలు, 34 వీవర్స్ సంఘాల్లో మొక్కలు నాటిస్తామన్నారు. సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి మొక్కల పెంపకం అవసరమన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్. పావణి మాట్లాడుతూ, తమ మున్సిపల్ వార్డుల్లో ఆకుపచ్చ సిరిసిల్లగా తీర్చిదిద్దడానికి, హరితహరం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. డివిజనలోని సర్పంచులు, జడ్.పి.టి.సి.లు, యం.పి.పి., కౌన్సిలర్లు, అధికారులు పాల్గొని ఆయా పరిధిల్లో మొక్కలు నాటే కార్యక్రమాల్లో చేపడుతున్న అంశాలపై ఈ అవగాహన కార్యక్రమాల్లో చేపడుతున్న అంశాలపై ఈ అవగాహన కార్యక్రమాల్లో వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్.డి.ఓ. బిక్షునాయక్, డి.ఎస్.పి. సుధాకర్, పిడిడి.ఆర్.డి.ఎ. అరుణ శ్రీ, డ్వామా పిడి గణేష్, జడ్.పి. సి.ఇ.ఓ. సూరజ్ కుమార్ పశ్చిమ డి.ఎఫ్.ఓ. వినోద్ కుమార్, స్ధానిక అధికారుల, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న గ్రామమైన ముష్టిపల్లె గ్రామంలోని స్మశానవాటిక, నిర్మాణంలో ఉన్న కమ్యూనిటి హల్ లను పరిశీలించారు. త్వరలో సిరిసిల్ల పట్టణం విస్తరణ జరుగనున్నందున స్మశాన వాటికను తాత్కాలికంగ వినియోగించుకోవాలని సూచించారు. ముష్టిపల్లి మండల పరిషత్ పాఠశాలలో కలెక్టర్ మొక్కలను నాటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *