
హైదరాబాద్ , ప్రతినిధి : శాసనసభా సంప్రదాయాలను టిఆర్ఎస్ తుంగలోకి తొక్కుతోందని టిడిపి తెలంగాణ ఎమ్మేల్యే రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో సభ్యులను గౌరవప్రదంగా చూడడం లేదని, తలసాని రాజీనామాను సభాపతి ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. 2004లో టిఆర్ఎస్ 26 మందితో ఎన్నికవడం జరిగిందని, అందులో వైఎస్ హాయంలో పది మంది కాంగ్రెస్ లోకి చేరారని గుర్తు చేశారు. అప్పుడు వీరిపై అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ పదే పదే కోరిందని, సభలో న్యాయం జరగకపోతే కోర్టు మెట్లు ఎక్కారని తెలిపారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ సభ సంప్రదాయాలను కాపాడుతుందని అనుకున్నామన్నారు. ఇటీవల కాంగ్రెస్..టిడిపి..వైసిపి పార్టీల నుండి కొంతమంది సభ్యులు టిఆర్ఎస్ లో చేరారని దీనిపై ఆ పార్టీలు స్పందించాయని తెలిపారు. వారిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇటీవలే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి కోసం పార్టీకి రాజీనామా చేశారని, గతంలో తలసానిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.