సఫాయి కర్మచారీల సమస్యలు తీర్చండి

కరీంనగర్: సఫాయి కర్మచారీల సమస్యలు తీర్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ సఫాయి కర్మచారీల కమీషన్ సభ్యులు విజయ్ కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేటు సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అధికారులతో సఫాయి కర్మచారీల స్దితిగతులు, సంక్షేమం, సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1993 లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కమీషన్ కేంద్ర ప్రభుత్వం కమీషన్ ఏర్పాటుచేసిందని, సఫాయి కర్మచారీల స్దితిగతుల, వారి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు గురించి అధ్యయనం చేసి, ప్రతి 3 నెలలకొకసారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నామన్నారు. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని, ప్రజలను ఎలా రక్షిస్తున్నారో, సఫాయి కర్మచారీలు పారిశుద్ద్యంతో మనలను రక్షిస్తున్నారన్నారు. సఫాయి కర్మచారీల వర్గం అన్ని వర్గాల కంటే అట్టడుగున వుందని, వీరి అభివృద్ధికిపాటుపడాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన సఫాయి కర్మచారీలుండాలని, వారితో ఒకటి, రెండు గంటలు పనిచేయించకుండా 8 గంటలు పనితీసుకొని ప్రభుత్వ నిబంధనలు మేరకు కనీస వేతనం చెల్లించాలన్నారు. కనీస వేతనలు ఇవ్వని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కార్మికునికి బ్యాంకు అకౌంట్ తెరిపించి, వేతనం నేరుగా ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల క్రింద పెండింగు వున్న కేసులను ఒక నెల లోపల పరిష్కరించాలన్నారు. సఫాయి కర్మచారీలకు గ్లౌస్, టోపీలు, దుస్తులు, స్వెటర్లు వెంటనే సరఫరా చేయాలన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేసి కార్మికులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, తదనుగుణంగా అవసరమైన మందులు, చికిత్స చేయించాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిశుభ్రానికి అవసరమైనంత సఫాయి కర్మచారీల నియామకంచేసి వారితో 8 గంటలు పనితీసుకొని, కనీస వేతనం చెల్లించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల ద్వారా చేపడుతున్న సంక్షేమ పధకాలపట్ల చైతన్యం కల్పించుటకు కార్మికుల కాలనీల్లో శిబిరాలు ఏర్పాటుచేసి వారికి అవగాహన కల్పించి, పధకాలు ఉపయోగించుకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పధకాల ప్రయోజనం కొరకు రెవిన్యూ శాఖ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సఫాయి కర్మచారీల పిల్లలు ఈ వృత్తిలోకి రాకుండా మంచి చదువులు చదివించాలని, వారిని ఉన్నతులు తీర్చిదిద్దాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీతో ఉపాధికి రుణాలు, విదేశాలలో ఉన్నత చదువులకు రుణాలు ఇస్తున్నాయని, వీటిని కార్మికులు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సఫాయి కర్మచారీలతో ఎన్ని గంటలు పని తీసుకుంటున్నది, ఎంత వేతనం ఇస్తున్నది, వారికి వివిధ, కేంద్ర, రాష్ట్ర్ర పధకాల ద్వారా అందిన చేయూత, వారి అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అట్టడుగు వర్గంవారు కావున అధికారులు మానవతాదృక్పధంతో ఉదారంగా వ్యవహరించాలని, సేవ చేసే అవకాశం వచ్చినందున మానవ సేవయే మాధవ సేవగా భావించి వారికి చేయూత నివ్వాలని ఆయన అన్నారు.

వాల్మీకినగర్ ను దర్శించుకున్న విజయ్ కుమార్

వాల్మీకినగర్ ను దర్శించుకున్న విజయ్ కుమార్

అనంతరం కమీషన్ సభ్యులు కలెక్టర్ తో స్దానిక వాల్మికినగర్ సందర్శించి, ఆ కాలనీలో వున్న కబేళాను వేరే చోటికి తరలించాలన్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ పి జోయల్ డేవిస్, కరీంనగర్ మునిసిపల్ కమీషనర్ కృష్ణ భాస్కర్, జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, ఓఎస్టి సబ్బారాయుడు, జిల్లా అధికారులు, సఫాయి కర్మచారీలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *