సన్నబియ్యం పథకం అమలులో రాజీలేదు : ఈటల రాజేందర్

క్వాలిటీ, క్వాంటిటీ మెయింటెయిన్ చేస్తున్నాం
పౌరసరఫరాల శాఖలో వందశాతం ప్రక్షాళన దిశగా వెళ్తున్నాం- మంత్రి ఈటల రాజేందర్

పౌరసరఫరాల శాఖపై గతంలో చాలా అపోహలు, ఆరోపణలు ఉండేవి. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రక్షాళన మొదలయ్యిందని చెప్పారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్. శాసనమండలిలో విపక్ష సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి సన్నబియ్యంపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. సన్న బియ్యాన్ని ఎం.ఎల్.ఎస్ పాయింట్ల నుంచి అందిస్తున్నాం. నిర్ధిష్ట ప్రమాణాల ప్రకారమే ధాన్యాన్ని సేకరిస్తున్నాం, బియ్యం వండి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు జరుపుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి సంవత్సరం నెల్లూరు సన్నాల్ని కొనుగోలు చేశాం. కానీ ఆ బియ్యం వండితే దొడ్డు అన్నం అయిందని తెలిపారు. అందుకే బియ్యం కొనుగోలు కంటే ముందు వాటిని వండి పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈసారి బీపీటీ, సాంబామసూరి, సోనామసూరి, 5204 రకాల్ని మాత్రమే సేకరించేందుకు జీవో లో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. సన్నబియ్యం పథకాన్ని అభినందించినందుకు పొంగులేటి సుధాకర్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ఎం.ఎస్.పీ ప్రకారం దొడ్డువడ్ల కంటే సన్నపు వడ్లకు ధర తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మన రైతులు నష్టపోకుండా ఉండేందుకు సన్నరకం వరిధాన్యాన్ని క్వింటాలు 1800 రూపాయలకు కొనుగోలు చేసేలా రైస్ మిల్లర్లను ఒప్పించి అమలు చేశాం. దీనివల్ల మార్కెట్లో రైతుకు 2200 రూపాయల ధర అందింది. పరోక్షంగా రైతుకు మేలు చేయగలిగాం అని మంత్రి తెలిపారు. స్టీమ్ రైస్ 30.50 రూపాయలు, రా రైస్ 30 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇక్కడ ధర ఎక్కువగా ఉండడంతో కొందరు దళారులు బీహార్ నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి మిల్లింగ్ చేస్తున్నారు. వాళ్లని పట్టుకుని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
సన్నబియ్యం పథకంలో అవకతవకలు లేకుండా జాగ్రత్తపడుతున్నాం. సంక్షేమ హాస్టళ్లలో గతంలో ఒక్కో విద్యార్థికి 175 గ్రాములు మాత్రమే కొలిచి పెట్టేవారు. కానీ ఆ విధానాన్ని మేము ఎత్తేసి విద్యార్థులకు సరిపడా తినే అంత పెడుతున్నాం. టీచర్లు, స్కూల్ సిబ్బందికి కూడా అదే భోజనం పెడుతున్నామని మంత్రి చెప్పారు. స్కూళ్లకు బియ్యం ఇవ్వడం వరకే పౌరసరఫరాల శాఖ బాధ్యత. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ మెయింటెయిన్ చెయ్యాలి. అయినా సరే అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
రేషన్ బియ్యాన్నితిరిగి మిల్లింగ్ చేసి సన్న బియ్యంగా మారుస్తున్నారని ప్రతిపక్షం వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి అవకాశం లేదని మంత్రి చెప్పారు. 2014 జూన్ 2 నుంచి పౌరసరఫరాల శాఖలో అక్రమాలపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో 75శాతం అవకతవకల్ని అరికట్టగలిగాం. సివిల్ సప్లయి అనేది ప్రజాకోణం ఉన్న శాఖ, ప్రజలకు అన్నం పెట్టే డిపార్ట్ మెంట్ అని మంత్రి అన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మూడున్నర కోట్ల జనాభా ఉంటే లబ్ధిదారుల సంఖ్య 3కోట్ల 8వేల మందిగా ఉండేది. కొందరికి రెండేసి కార్డులు ఉండడం వల్ల కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తే ప్రస్తుతం 2.74కోట్ల మంది తెల్లకార్డు లబ్ధిదారులున్నారు. వారందరికీ బియ్యం అందిస్తున్నాం. కానీ కేంద్రం మాత్రం 1.91 కోట్ల మందిని మాత్రమే బీపీఎల్ గా గుర్తించిందన్నారు. ఈ-పాస్ మిషన్లను హైదరాబాద్ లో సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా బోగస్ కార్డులను అరికట్టగలిగినట్లు మంత్రి వివరించారు. . గ్రామస్థాయి వరకూ ఈ-పాస్ అమలు చేస్తే పౌరసరఫరాల శాఖ వందశాతం ప్రక్షాళన జరిగినట్లే అన్నారు. తమ శాఖను మరింత బలోపేతం చేసి అర్హులైన పేదలందరికీ బియ్యం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు. రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి మాత్రమే కానీ ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్, కళ్యాణలక్ష్మి పథకాలకు ఉపయోగిస్తున్నారని మంత్రి చెప్పారు.

About The Author

Related posts