సచివాలయంలో మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

ఈరోజు నుంచి కేజీబీవి జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం

కేజీబీవి జూనియర్ కాలేజీలలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులుంటాయి

ఒక్కో సెక్షన్లో 20 మందికి బదులు 40మందికి అడ్మిషన్లు

కేజీబీవీలలో పోషకాహారం, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నాం

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల విద్యార్థినిల్లో రక్తహీనత తగ్గింది

సచివాలయంలో మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్ : కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు ఈ ఏడాది నుంచి జూనియర్ కాలేజీలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బాలిక విద్యపై వేసిన కేబ్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇచ్చిన ప్రతిపాదనల మేరకు దేశవ్యాప్తంగా కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలుంటే…వీటిలో 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని, వీటిలో అడ్మిషన్లకు నేటి నుంచే నోటిఫికేషన్ ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. సచివాలయంలో నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలికల డ్రాపవుట్స్ తగ్గించి, పాఠశాలల్లోనమోదు శాతం పెంచే విధంగా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి తనను చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ కమిటీ సంవత్సరం పొడవునా కొన్ని రాష్ట్రాలలో పర్యటించి, అక్కడున్న మంచి ప్రాక్టిసులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఈనివేదికలో ఇచ్చిన ప్రతిపాదనల్లో దేశవ్యాప్తంగా ఉన్న కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడగించాలని సూచించినట్లు తెలిపారు. దీనివల్ల బాల్య వివాహాలు అరికట్టవచ్చన్నారు. ప్రస్తుతం 6,7,8 తరగతులకే కేజీబీవీలు పరిమితమయ్యాయని, ఆ తర్వాత విద్య ముగించి గ్రామాలకు వెళ్లినప్పుడు పిల్లలకు పెళ్లిల్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడగిస్తే…ఇంటర్ పూర్తి చేసే నాటికి 18 సంవత్సరాల వయసు వస్తుందని, తద్వారా బాల్యవిహహాలు అరికట్టవచ్చని తమ కమిటీ సూచించిందని, కేంద్రం దీనిని ఆమోదించినందుకు ధన్యవాదాలన్నారు. కేజీబీవీలో ప్రస్తుతం ప్రతి సెక్షన్ కు 20 మంది విద్యార్థులనే తీసుకోవాలని నియమ నిబంధన ఉందని, దీనిని 40 కి పెంచి ప్రతి సెక్షన్ లో రెండు సెక్షన్లు ఆర్ట్, సైన్స్ పెట్టాలని కేంద్రానికి సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచనప్రాయంగా అంగీకరించినట్లు చెపారు. తెలంగాణ ఏర్పడక ముందు మన తెలంగాణలో 391 కేజీబీవీలుండేవని, తెలంగాణ వచ్చాక పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అందులోని కొత్త మండలాల్లో 84 కేజీబీవీలను నూతనంగా ఏర్పాటు చేసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ కొత్త కేజీబీవీలతో కలిపి రాష్ట్రంలో 475 కేజీబీవీలు అయ్యాయన్నారు. వీటిల్లో 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసుకుంటున్నామన్నారు. కేజీబీవీలలో ఎక్కువగా అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే ఉన్నవాళ్లు, బాగా వెనుకబడినవాళ్ల పిల్లలుంటారని, వీరికి ఇక్కడ నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. రెండేళ్ల కిందటే ఈ కేజీబీవీలలో చదివే విద్యార్థుల కోసం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీలలో 25 శాతం రిజర్వేషన్లు కేజీబీవీ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయినా కూడా చాలామంది కేజీబీవి విద్యార్థినిలకు ఇంటర్ లో సీట్లు దొరకడం లేదన్నారు. ఇప్పుడు కేజీబీవీలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ కావడంతో ఈ సమస్య తీరిందన్నారు. ప్రతి మూడు కేజీబీవీ కాలేజీలలో రెండింటిలో సైన్స్ గ్రూపులు, ఒక కాలేజీలో ఆర్ట్స్ గ్రూప్ పెడుతున్నామన్నారు. గత ఏడాది నుంచే రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో, హాస్టళ్లలో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల కోసం కొత్త మెనును రూపొందించి అమల్లోకి తీసుకొచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో నెలకు ఆరు రోజులు మాంసాహారం, ఇందులో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, వారానికి ఐదు రోజులు గుడ్లు, ప్రతి రోజు నెయ్యి ఇస్తున్నామన్నారు. ఇది ఇచ్చిన తర్వాత కేజీబీవీలలో విద్యార్థినిల ఆరోగ్యాన్ని పరిశీలిస్తే వారిలో హిమోగ్లోబిన్ పెరిగినట్లు గుర్తించామన్నారు. ప్రతిరోజు ఉదయం పాలు, రాగిమాల్ట్ , బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి పోషకాహారం దేశం మొత్తంలో తెలంగాణలోనే ఇస్తున్నామని తెలిపారు.

హెల్త్ అండ్ హైజీన్ కిట్స్

గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, హాస్టళ్లలో విద్యార్థులకు పోషకవిలువలు కలిగిన ఆహారం అందిస్తూనే 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల బాలికలకు రుతుస్రావ ఇబ్బందులను తొలగించే విధంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. దీనికయ్యే ఖర్చును సిఎం కేసిఆర్ దృష్టికి తెచ్చినప్పుడు ఆయన విద్యాశాఖకు 100 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. దీంతో ఈసారి అన్ని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీరాజ్ పాఠశాలలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. ఇందులో ఆడపిల్లలకు అవసరమయ్యే దాదాపు 13 రకాల 50 వస్తువులు బ్రాండెడ్ కంపెనీలవే ఉన్నాయన్నారు. 12 నెలలకు సరిపడే విధంగా మూడు నెలలకొకసారి ఏడాదిలో నాలుగుసార్లు ఈ కిట్స్ ఇస్తామన్నారు. తెలంగాణలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆరున్నర లక్షల మందికి ఈ కిట్స్ అందించనున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కేజీ టు పీజీ ఏమైందని, ఈ కిట్స్ కొత్త పథకమేమి కాదని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏపని చేసినా విమర్శించడం వీరికి ఒక అలవాటుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైద్య శాఖ కిషోర బాలిక స్వాస్త్య యోజన పథకం కింద యువతులకు ఆరు రూపాయలకు ఆరు న్యాప్కిన్లు అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇది కొన్ని జిల్లాలకే పరిమితం చేశారని, ఇందుకోసం కేవలం రెండున్నర కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. మన రాష్ట్రంలో ఉన్న యువతులకు సానిటరీ న్యాప్కిన్లు ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయలు కావాలన్నారు. అయితే తెలంగాణలో గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ఆరు లక్షల 25వేల మంది ఉన్నారన్నారు. వీరికి అవసరమైన 13 రకాల వస్తువులు 12 నెలలు పాటు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 1600 రూపాయల చొప్పున ఆరు లక్షల మందికి 96 కోట్లు రూపాయలు అవసరమవుతాయన్నారు. సానిటరీ న్యాప్కిన్స్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన స్టేఫ్రీ ఇస్తున్నామన్నారు. మిగిలిన వస్తువులు కూడా పతంజలి, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి బ్రాండెడ్ కంపెనీలవే ఇస్తున్నామని చెప్పారు.. కొంతమంది అసహనంతో రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ఈ విమర్శలు చేసేవాళ్లు తెలంగాణలో ఇస్తున్న హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు విజ్ణప్తి పత్రం ఇచ్చామని, ఇందులో తెలంగాణలో ఇస్తున్న హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ దేశమంతా ఇవ్వాలని, తద్వారా ఆడపిల్లల డ్రాపవుట్స్ తగ్గుతాయని పేర్కొన్నట్లు వెల్లడించారు. బిజెపి శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పథకం బాగుందని, ప్రధానిని కలిసి దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతానని చెప్పినట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలు, కిట్ కావాలని అడిగారని, ఈరోజే ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్, నోట్ పంపిస్తున్నట్లు చెప్పారు.. ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే…వీటిని వచ్చి చెక్ చేసుకోవచ్చన్నారు.

కేజీ టు పీజీ పక్కాగా అమలు

తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అందరికీ నాణ్యమైన విద్య అందించాలని దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అత్యధికంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మన రాష్ట్రంలో కొత్తగా 84 కేజీబీవీలు, 17 మోడల్ స్కూల్స్, 573 గురుకుల పాఠశాలలను ప్రారంభించుకున్నామన్నారు. ఈ సంవత్సరం 187 జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ విధానంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీల బాలికల కోసం 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చిన ఘనత తెలంగాణరాష్ట్రానిదే అన్నారు. ఇవన్నీ కేజీ టు పీజీలో భాగంగానే ఏర్పాటు చేశామన్నది విమర్శించే వాళ్లు గుర్తించాలన్నారు. డిగ్రీ కాలేజీలలో భవనాల కోసం 160 కోట్ల రూపాయలు, జూనియర్ కాలేజీల భవనాలకు 250 కోట్ల రూపాయలు, పాలిటెక్నిక్ భవనాల కోసం 145 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. యూనివర్శిటీల బలోపేతం చేసేందుకు 1061 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతినిచ్చామన్నారు. మౌలిక వసతుల కోసం 500 కోట్లు ఇచ్చామన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషితో ప్రభుత్వ పాఠశాలలు మంచిగా పనిచేస్తున్నాయన్న పేరు వస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయన్నారు. గత ఏడాది నుంచి డిగ్రీ అడ్మిషన్లను దోస్త్ ద్వారా ఆన్ లైన్ చేశామన్నారు. దీనివల్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో సీట్లు భర్తీ అయి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయన్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నది స్పష్టమైతున్నదన్నారు.

ఉపాధ్యాయ బదిలీల వెబ్ సైట్ ప్రారంభం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సాధారణ బదిలీలలకు అవకాశం ఇచ్చారని, ఈ ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పారదర్శక విధానాన్ని రూపొందించామని, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడానికి వెబ్ సైట్ రూపొందించి నేడు ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల బదిలీలల సమాచారం ఇందులో ఉందన్నారు. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీలలోని నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీల సమాచారం కూడా ఉందన్నారు. ప్రస్తుతానికి కేజీబీవీలలో బదిలీలు చేపట్టడానికి వీలులేదని, కేజీబీవీలు కేంద్ర ప్రభుత్వ పథకం కింద నడుస్తున్నాయన్నారు. ఇందులోని ఉపాధ్యాయులు రెగ్యులర్ కాలేదని అందుకే బదిలీలు ఉండవన్నారు. మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ అయ్యారని, వీరి బదిలీలు ఆగస్టులో చేపడుతామన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాటలపై కడియం ఆగ్రహం

ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కానీ కాంగ్రెస్ నేతల కంటికి ఇవి కనిపించడం లేదని, దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు పథకాన్ని రాబంధు పథకమనడంపై మండిపడ్డారు. ఒక జాతీయ పార్టికి రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు పథకం రాబంధు పథకం ఏ విధంగ అవుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేసిందన్నారు. వ్యవసాయానికి రైతుకు రుణమాఫీ చేశామని, 24 గంటల కరెంటు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టామని, నీటి తీరువా రద్దు చేశామని, రైతు పెట్టుబడి కింద 4000 రూపాయలను ఇప్పటికే అందించామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రైతుకు రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఇన్ని రకాల రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఉందా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలివితక్కువగా మాట్లాడొద్దని, ఎదిగిన నాయకత్వం అవగాహనతో మాట్లాడాలని సూచించారు. కొంతమంది విద్యావ్యవస్థను నాశనం చేశారని మాట్లాడుతున్నారని, గతంలో విద్యావ్యవస్థను నాశనం చేసిన వారు ఇలా మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకున్న కార్యక్రమాల వల్ల ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందన్నారు. దీనికి నిదర్శనం మా అడ్మిషన్లు, ఫలితాలన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేపడుతారు, నియామకాలు చేపడితే వారి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు కోర్టుకెళ్లి స్టేలు తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డబుల్ గేమ్ లు ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టాలంటారు, కడుతుంటే అడ్డుకునే విధంగా స్టేలు తెస్తారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవాలని చెప్పే కాంగ్రెస్ నేతలు..రైతుబంధు పథకం తెస్తే దానిని రాబంధు పథకమంటారా? అని ప్రశ్నించారు. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడినం, దీనికి మాకే పేటెంట్ ఉంది కాబట్టి మాలాగే ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుందేమోనని భ్రమల్లో ఉన్నారన్నారు. కానీ అలాంటి తప్పు పనులు మేం చేయమన్నారు. ప్రజల పక్షానా ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తామని చెప్పారు. ప్రతి విషయం చిల్లరగా మాట్లాడి నవ్వుల పాలు కావద్దని సలహా ఇచ్చారు. 2019లో అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారని, కానీ అది కల అని, ఎప్పటికీ నిజం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వండని, ప్రతిది రాజకీయ కోణంలో ఆలోచించి విమర్శించడం మంచిదికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సలహా ఇచ్చారు. 8792 మంది టీచర్ల రిక్రూట్ మెంట్ ను టిఎస్సీపిఎస్సీ ద్వారా చేశామని, అయితే కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారన్నారు. త్వరలోనే కోర్టులో స్టే ఎత్తివేయించి భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలనే ఆలోచనలోనే ఉందన్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఇచ్చిన 10 శాతం పెంపును అమలు చేయడం లేదన్నారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కమిషనర్ అధర్ సిన్హా, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ఇతర అధికారులుపాల్గొన్నారు.

kadiyam srihari 1     kadiyam srihari 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *