
ముంబై, ప్రతినిధి : మన టాలీవుడ్ లో అయితే వందమందిని ఒక్క మన హీరోనే చంపేస్తాడు.. తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్తుంది. మన తెలుగు హీరోల్ని వర్ణించడానికి పులులు సింహాలు కావాలి.. బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ.. సందేశాత్మక సినిమాలు తీస్తే ప్లాపే.. అందుకే వాటి జోలికి మన తెలుగు సినిమా హీరోలు పోరు.. అలాంటి సందేశాత్మక సినిమాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సరిపడవనే అపోహ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ లో ఉంది.
కానీ తన కొత్త సినిమా పీకే తో ఆ సందేహాన్ని మరోసారి చెరిపేశాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. సమాజానికి మంచి చెప్పాలంటే దర్శకులు, హీరోలు సాహసం చేయాల్సిన పనిలేదని, సమస్యలపై పోరాడాలన్న చిత్తుశుద్ధి, సంకల్పం ఉండాలని నిరూపించాడు. యాభై ఏళ్లు పైబడినా, మనవరాళ్ల వయసున్న హీరోయిన్లతో పిచ్చిపిచ్చి డాన్సులు చేస్తూ, వందమంది విలన్లను మట్టికరిపించే స్టంట్స్ చేస్తున్న మన తెలుగు హీరోలకైతే అమీర్ ఖాన్ చేసిన ‘పీకే’ ఓ గుణపాఠమే.
కథేంటి…?
గ్రహాంతర వాసి అయిన కథానాయకుడు అమీర్ ఖాన్ భూమ్మీద దిగగానే అతని రిమోట్ కంట్రోల్ ను ఓ వ్యక్తి దొంగిలిస్తాడు. ఆ రిమోట్ కంట్రోల్ ఉంటేనే, అతడు తిరిగి తన గ్రహంపైకి వెళ్లగలడు. అందుకే ఆ రిమోట్ కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో దేవుడి పేరుతో దేవాలయాల వద్ద జరుగుతున్న దోపిడీ, స్వామిజీలు చేస్తున్న మోసాలు పీకే ను ఆవేదనకు గురి చేస్తాయి. టీవీ రిపోర్టర్ అనుష్క శర్మ సహాయంతో ఓ స్వామీజీ వద్ద ఉన్న తన రిమోట్ ను కథానాయకుడు ఎలా దక్కించుకున్నాడనేది మిగిలిన కథ.
విశ్లేషణ
‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’ సినిమాలతో వ్యవస్థను ప్రశ్నించిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ‘పీకే’ కథలో మత వ్యవస్థను నిలదీశాడు. మతం, దేవుడు పేరుతో కొంతమంది సాధువులు, సంతులు, స్వామీజీలు చేస్తున్న మోసాలను ఈ చిత్రంలో ఎండగట్టాడు. స్వార్థంతో కొంతమంది మరో దేవుడిని సృష్టిస్తూ, ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో ఈ దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు. దేవుడు తన బిడ్డలను ముడుపులు, బలులు ఎందుకు కోరుతాడు? మోకాళ్ల మీద నడిస్తేనో, పొర్లు దండాలు పెడితేనో దేవుడు మన కష్టాలు తీరుస్తాడా? అంటూ మూఢ నమ్మకాలపై పీకే క్యారెక్టర్ తో చెప్పించిన డైలాగులు థియేటర్లలో చప్పట్లు మ్రోగించాయి.
చిత్ర యూనిట్ ప్రతిభా పాటవాలు…
సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదని నమ్మే స్టార్ హీరో అమీర్ ఖాన్ పీకే తో మరిన్ని ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. సందేశాత్మక సినిమాలతో ఎంతటి ఘనవిజయాలు సాధించవచ్చో అమీర్ చేసి చూపిస్తున్నాడు. పీకే క్యారెక్టర్లో అమీర్ వేసిన గెటప్స్, అత్యంత సహజమైన నటన, ఇతనొక్కడికే సాధ్యమేమో అనిపిస్తుంటుంది. జగత్ జనని పాత్రలో అనుష్క శర్మ గ్లామర్ తో, ఫర్మార్మెన్స్ తో ఆకట్టుకుంది. మిగతా సాంకేతిక వర్గమంతా సినిమా స్థాయిని పెంచింది. హిరానీ లాంటి దర్శకులు, అమీర్ లాంటి స్టార్స్ నవ్విస్తూనే ఆలోచింపజేసే పీకే లాంటి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. మన సోకాల్డ్ స్టార్ హీరోలు, పులులు, సింహాలు కనీసం పీకే లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసే ఆలోచనైనా చేయాలని ఆశిద్దాం.
సినిమాకి జనాలు ఇస్తున్న రేటింగ్ : 4.5/5