
ముంబాయి, ప్రతినిధి : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సెలవు ముగిసిసోయింది. ఆయనకు మంజూరు చేసిన 14 రోజుల ఫర్లాఫ్ ముగియడంతో ఎరవాడ జైలుకు వెళ్లారు. సంజయ్‌దత్ సెలవును పొడిగించాలన్న విజ్ఞప్తిని యరవాడ జైలు అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. 55 ఏళ్ల సంజయ్ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా రెండు వారాల ఫర్లాగ్పై బయటకు వచ్చారు. బుధవారంతో సెలవు ముగియడంతో మరో రెండు వారాలపాటు ఫర్లాగ్ పొడిగించాలని సంజయ్ దరఖాస్తు పెట్టుకోగా చివరి నిముషంలో అధికారులు తిరస్కరించారు. సెలవు పొడిగింపుకు అనుకూలంగా అధికారులు అనుమతి ఇచ్చారని ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్ చేశారో అర్థం కావడం లేదని సంజయ్ తరపు న్యాయవాది హితేన్ జైన్ పేర్కొన్నారు. సంజయ్‌దత్ మాటి మాటికి సెలవు తీసుకోవడంపై విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తమ ప్రభుత్వం చట్టప్రకారంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్పష్టం చేశారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమాయుధాలు కలిగి ఉన్నరన్న కారణంతో కోర్టు సంజయదత్కు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.