
కరీంనగర్, ప్రతినిధి : చీఫ్ విప్ పదవి వచ్చినా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సంతోషంగా లేరా.. నిన్న జరిగిన సన్మానసభలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరనీ ఆలోచనలో పడేశాయి.. ‘‘తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లాకు ఎన్ని పదవులు, బాధ్యతలు ఇచ్చినా తక్కువేనని ’’ కొప్పుల ఈశ్వర్ అన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చిన ఆయనకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం జడ్‌పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జడ్‌పీ సమావేశ మందిరంలో జరిగిన అభినందన సభ, మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తి స్థాయి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఈశ్వర్ అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నానన్నారు.
శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అభినందన సభ సందర్భంగా ఎంపీ వినోద్‌కుమార్, కొప్పుల ఈశ్వర్ చేసిన ప్రసంగాలు సమావేశంలో ఆసక్తిని రేకెత్తించాయి. తొలుత ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు ఈశ్వర్ ముందు నుంచి పరిచయమని, పార్టీ ఏర్పాటుకు ఏడాది నుంచే కేసీఆర్ కొంత మంది నేత లతో చర్చలు జరిపేవారని, జెండా, ఏజెండా గురించి చర్చిం చేవారమని, అందులో ఈశ్వర్‌తోపాటు తానూ ఉన్నానని ఈశ్వర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. మరో అడుగు ముందుకు వేసి ఈశ్వర్ చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదని, మరిన్ని బాధ్యతలు కట్టబెట్టడం ఖాయమంటూ ఆయన ప్రకటన చేయగా ఈశ్వర్ వర్గీయులు హర్షధ్వానాలు చేశారు.
అయితే తర్వాత ప్రసంగించిన ఈశ్వ ర్ మాత్రం తాను పార్టీ ఏర్పాటైన వారం రోజులకు టీఆర్ ఎస్‌లో చేరానని అనడం గమనార్హం. 2001 ఏప్రిల్ 27న పార్టీ ప్రకటన చేయగా కేసీఆర్ ఆహ్వానం మేరకు మే 2న టీఆర్‌ఎస్‌లో చేరానని, నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని అన్నారు. మం త్రి పదవి దక్కకపోవడంతో ఈశ్వర్ అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేం దుకు ఎంపీ వినోద్‌కుమార్ ఈ రకంగా ప్రసంగించగా ఆ వెనువెంటనే ఈశ్వర్ ఎంపీ ప్రకటనను విబేధించిన వైనం టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని ప్రచా రం జరగగా చివరి నిముషంలో అవకాశం చేజారిపోయింది. మలి విడత విస్తర ణలో ఈశ్వర్‌కు ఖాయమంటూ మళ్ళీ ప్రచారం మొదలైంది. స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ కూడా ఈశ్వర్‌కు మంత్రి పదవి ఖాయమంటూ ప్రకటన చే యడంతో ఆయన వర్గీయులతోపాటు దళిత వర్గానికి చెం దిన వారందరూ సంతోషపడ్డారు. తీరా ఈశ్వర్‌కు మంత్రి పదవికి బదులు చీఫ్ విప్ పదవిని కట్టబెడుతూ జీవో జారీ చేయడంతో ధర్మపురి నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఈశ్వర్ కూడా చీఫ్ విప్ పదవి తీసుకునేందుకు నిరాకరించగా సీఎం బుజ్జగించడంతో అన్యమనస్తంగా నే ఒప్పుకున్నారు.
కాగా కరీంనగర్ జడ్పీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అంతా సాఫీగా సాగినా తీరా చివరికి వచ్చే సరికి ఎంపీ వినోద్‌కుమార్ చేసిన ప్రసంగాన్ని ఈశ్వర్ స్వయంగా ఖండించడం టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.