సంక్షేమం చక్కదిద్దండి..

హైదరాబాద్ : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు రెండవరోజు మొదటి సెషన్ లో సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు, చేసిన సూచనలు, తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.
– కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లబ్దిపొందడానికి తహసిల్దార్లకే దరఖాస్తు చేసుకోవాలి. రెండు రోజుల్లో పరిశీలన పూర్తి చేసి పెళ్లికి ముందే డబ్బులు ఇవ్వాలి. అనవసర చిక్కులు కలిగించకుండా, సరళమైన విధానాలతో పేదలకు సాయం చేయాలి.
– దళితుల అభవృద్ధి విషయంలో ప్రచారం జరిగింది తప్ప, గుణాత్మక మార్పు లేదు. దళితుల కుటుంబాల్లోంచి దారిద్య్రాన్ని పారద్రోలడమే ప్రభుత్వ లక్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలను అభవృద్ది చేయాలి. వారు మళ్లీ పేదలుగా మారకుండా చర్యలు తీసుకోవాలి. దళితులకు భూములు ఇవ్వడమే కాకుండా వ్యవసాయం చేసుకునే ఏర్పాట్లు చేయాలి.
– రూరల్, సెమిఅర్బన్, అర్బన్ దళితులు, ఎస్టీలకు ఇంకా ఏమి చేయవచ్చో అధ్యయనం చేసి ప్రభుత్వానికి అధికారులు సూచనలు చేయాలి.
– బంగ్లాదేశ్ లో యునస్ అనే ప్రోఫెసర్ చిన్న వర్తకుల జీవన ప్రగతికి చేసిన ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల విప్లవానికి దారి చేసింది. అదే విధంగా కొత్త ఆలోచనలు చేయాలి.
– కలెక్టర్లు ఇతర అధికారులు, దళిత బస్తీలు గిరిజన తండాల్లో కొంత సమయం గడిపితే వాస్తవాలు తెలుస్తాయి.
– దళిత పారిశ్రామిక వెత్తలను ప్రోత్సహించడానికి టి-ప్రైడ్ అనే కార్యక్రమం తీసుకున్నాం. దళిత పారిశ్రామిక వెత్తలను ప్రోత్సహించాలి. ఇంజనీరింగ్ చేసిన ఎస్సీ, ఎస్టీ యువకులకు శిక్షణ ఇచ్చి, పెట్టుబడి సమకూర్చి ప్రోత్సహించాలి. దళితులను కాంట్రాక్టర్లుగా అభివృద్ది చేయాలి. కాంట్రాక్టర్ల వద్ద పని చేసే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే అనుభవం వుంది. వారిని గుర్తించి, కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి.
– ఇండస్ట్రియల్ ఎస్టెట్స్ లో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాంట్లు రిజర్వు చేసి పెట్టాలి.
– వివిధ పోటీ పరిక్షల కోసం విధ్యార్థులను సిద్దం చేయాలి. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగాలున్నాయి? అవి దక్కాలంటె ఎలా ప్రిపేర్ కావాలి? అనే విషయాలను అధికారులు విద్యార్థులకు చెప్పాలి. జిల్లాల్లో స్టడి సర్కిల్స్ ఏర్పాటు చేయాలి. కలెక్టర్లు, ఎస్పీలు కూడా పిల్లలకు నేరుగా బోధన చేస్తే స్పూర్తి దాయకంగా వుంటుంది.
– అమ్మాయిలు చదువుకునేందుకు అవసరమయ్యే విధంగా బోధన, వసతి సౌకర్యాలు కల్పించాలి.
– విద్యార్థులు ఇంగ్లీష్, హింది భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించే విదంగా విద్యా శాఖ ప్రణాళికలు రూపొందించాలి.
– ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మంత్రులు, అధికారులు త్వరలోనే సమావేశం పెట్టుకుని ఈ వర్గాల విద్యార్థులు, యువకుల కోసం ఏమి చేయాలనే విషయంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. కలెక్టర్లు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సూచనలు పంపాలి.
– వివిధ సందర్బాల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి అనువుగా ప్రతీ కలెక్టర్‌ వద్ద రూ. కోటి నిధిని పెడతాం.
– దళితుల వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడిని విడుదల చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తాం. భూ పంపిణీతో పాటు, వ్యవసాయం చేయడమూ అవసరం.
– ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనారిటీ పిల్లలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. మైనారిటీల్లో, ముఖ్యంగా ముస్లింలలో చాలా పేదరికం వుంది. వివిధ ప్రభుత్వ పథకాల్లో ముస్లింలు ఎక్కువగా లబ్దిపొందడం లేదు. ముస్లింలను ఓటు బ్యాంకు గానే ఉపయోగించారు. ఈ ప్రభుత్వం అలా కాదు. ముస్లిం పిల్లలను ప్రోత్సహించాలి. గృహ నిర్మాణం, డిఆర్‌డిఎ పథకాలు తదితర పథకాల్లో ముస్లింలు తక్కువ శాతం ఎందుకు ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. గ్రామీణ, సెమి అర్బన్‌, అర్బన్‌ ముస్లింల కోసం ఏమి చేయాలో అధ్యయనం చేయాలి. ఇప్పటికి ఉన్న పథకాలను సమీక్షించి, కొత్త పథకాలు రూపకల్పన చేయాలి.
– ప్రతీ జిల్లాలో మైనారిటీల కోసం రెండు మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఒకటి బాలికలకు, మరొకటి బాలురకు.
– వక్ఫ్‌ భూముల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించాలి. వక్ఫ్‌ భూముల వివరాలు కలెక్టర్లకు పంపుతాం. జీఓ 58 కింద వక్ఫ్‌ భూములు రెగ్యులరైజ్‌ చేయడానికి వీలు లేదు.
– కళ్యాణలక్ష్మి, షాదీ మూబారక్‌ నిధులను గ్రీన్‌ ఛానల్‌లో అందుబాటులో పెట్టాలి.
– వక్ఫ్‌ అంటే దానం/విరాళం. అలా వచ్చిన భూములను ముస్లింల అభివృద్దికి వాడాలి.
– తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసి, మైనారిటీలు ఎక్కువ. అందుకే వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తున్నాం.
– సంక్షేమ హాస్టళ్లలో అవినీతిని సహించవద్దు. సన్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలి. హాస్టల్‌ పిల్లలకు బ్లాంకెంట్లు కొనివ్వాలి.
– ఈ సమావేశం ముగిసిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో ఆర్‌డిఓ, ఎంఆర్‌ఓ, ఎంపిడిఓలతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలను, వీటి అమలు వారితో పర్యవేక్షించాలి.
– హాస్టల్‌ విద్యార్థులకు వెంటనే కొత్త గ్లాసులు, ప్లేట్లు కొనియ్యండి. ఎస్‌పీలు జిల్లాలో పర్యటించే సందర్బంగా హాస్టళ్లను సందర్శించాలి. అక్కడి పరిస్థితులు గమనించాలి. హాస్టళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు, మురికి నీటి కాల్వలు, విద్యుత్‌ బాగుండాలి. వాటి నిర్వహణకు అవసరమయ్యే పనులు వెంటనే చేపట్టాలి. నెలలో ఒకరోజు హాస్టల్‌ డే నిర్వహించాలి. కాస్మొటిక్‌ చార్జిలను సమీక్షించి, అవసరమైన మేర పెంచుతాం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *