సంక్షేమంలో, అభివృద్ధిలో, జీడీపీలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది:కడియం శ్రీహరి

 • తెలంగాణను విజయవంత ప్రయోగంగా సిఎం కేసిఆర్ మార్చారు
 • అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ అభివృద్ధి, ఖ్యాతి సాధించడం సిఎం కేసిఆర్ దక్షతకు నిదర్శనం
 • సంక్షేమంలో, అభివృద్ధిలో, జీడీపీలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
 • ఆర్టీఈ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయొద్దు అనుకుంటున్నాం
 • ఆర్టీఐ చట్టాన్ని మేం అనుసరించమని కేంద్రానికి కూడా స్పష్టం చేశాం
 • కేజీ టు పీజీలో భాగంగానే గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం
 • మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి
 • ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు పెంచొద్దని మెమో ఇచ్చాం…కోర్టులు దీనిని నిలిపివేసింది
 • ఎక్కువ ఫీజులు వసూళ్లను తప్పకుండా  నియంత్రిస్తాం
 • పార్టీ నిర్ణయం, నాయకుడి నిర్ణయానికి కట్టుబడి నా రాజకీయ భవిష్యత్  ఉంటుంది
 • 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాను...
 • తెలంగాణ ఏర్పడిన 44 నెలల్లో 36 నెలలు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆనందంగా ఉంది
 • ఈ అవకాశం కల్పించిన సిఎం కేసిఆర్, జిల్లా ప్రజలకు కృతజ్ణతలు
 • వరంగల్ లో విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

 

హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ పార్టీ అధికారం చేపట్టడంతో చాలా మంది ఇదొక విఫల ప్రయోగం అవుతుందని అనుకుంటున్న సందర్భంలో గత 44 నెలల్లోనే దీనిని విజయవంతమైన ప్రయోగంగా నిరూపించిన ఘనత సిఎం కేసిఆర్ కు దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రంలో, ఖ్యాతి సాధించిన రాష్ట్రంగా, జీడీపీలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన రాష్ట్రంగా నిలబడడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలనా దక్షతే కారణమన్నారు. అభివృద్ధిలో సంక్షేమంలో ఇతర రాష్ట్రాలతో పోటీపడడం కాకుండా ఆ రాష్ట్రాలను అధిగమించి నేడు నెంబర్ వన్ స్థానంలో నిలబడడం, దీనిలో నేను ఉప ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకుని భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వరంగల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో వరంగల్ జిల్లా ప్రముఖ పాత్ర పోషించిందని భావించిన సిఎం కేసిఆర్ ఈ జిల్లా రుణం తీర్చుకోవాలని తెలంగాణలో ఎక్కువగా ప్రాజెక్టులు, పనులు, పదవులు, విద్యా సంస్థలు, నిధులు ఇచ్చి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ ను అతిపెద్ద పట్టణంగా తీర్చిదిద్దుతున్నందుకు ఆయనకు  ధన్యవాదాలు అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో ముందుకెళ్తోందన్నారు.

పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన నేత కార్మికుల వెతలు తీర్చేందుకు వారిని తిరిగి స్వరాష్ట్రానికి రప్పించడానికి టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆనాడు సిఎం కేసిఆర్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పార్క్ ను వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని,  కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో సిఎం కేసిఆర్ స్వయంగా వరంగల్ లో దానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషమన్నారు. హైదరాబాద్ తర్వాత మరొక పెద్ద ఐటి కేంద్రంగా, హైదరాబాద్ కు సాటిలైట్ టౌన్ షిప్ గా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, హైదరాబాద్ తరహా ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొస్తూ, ఎడ్యుకేషన్ హబ్ చేస్తూ జిల్లాను సిఎం కేసిఆర్ అమితమైన ప్రేమతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయొద్దని అనుకుంటున్నామని,. విద్యా హక్కు చట్టం నిబంధనలు, మార్గదర్శకాలను మేం అనుసరించమని కూడా కేంద్రానికి స్పష్టం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దీనిని అమలు చేస్తే మరొక ఫీజు రియింబర్స్ మెంట్ స్కీం అవుతుందని,  దీనిని అమలు చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇచ్చే నిధులతో ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు రాష్ట్రంలో కేజీ టు పీజీ అమలు చేయడంలో భాగంగానే గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మన గురుకులాలు ఇప్పుడు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వంలో 544 గురుకులాలు ఏర్పాటు చేస్తుకున్నాం…ఇంత పెద్ద సంఖ్యలో దేశంలో ఎక్కడా కూడా గురుకులాలు లేవని స్పష్టం చేశారు.

ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో కమిటీ వేశామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ కమిటీ నివేదికను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని, అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులు పెంచొద్దని ఇప్పటికే మెమో ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్లు తెలిపారు. ఒకవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలంటూ…మరొకవైపు ఫీజు నియంత్రించే నిర్ణయాలపై కోర్టులే స్టేలు ఇస్తున్నాయన్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని కార్పోరేట్, ఇంటర్నేషనల్ ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఇలాంటి వాటిని కచ్చితంగా నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  కడియం శ్రీహరి 2019 తర్వాత రాజకీయాల్లో ఉంటారా?, ఉండరా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..‘‘ ఈ మూడేళ్ల ఉప ముఖ్యమంత్రి పదవీకాలంలో, 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తు, పల్లాలు చూశాను. ఇంకా చూడాల్సింది ఏమి లేదని అనుకుంటున్నాను. అందుకే నా మటుకు నేను 2019 ఎన్నికల వరకు రాజకీయాల్లో ఉండి ఆగిపోతే చాలనుకున్నాను. అయితే ఈ స్టేట్ మెంట్ చూసిన మా నాయకుడు కేసిఆర్ రాజకీయాల్లో ఉండడం నీ ఇష్టం కాదు…దానిని నిర్ణయించాల్సింది పార్టీ, ప్రజలు అన్నారు. అందుకే పార్టీ నిర్ణయానికి, నాయకుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’’ అన్నారు. రాజకీయ 30 ఏళ్ల జీవితంలో నిజాయితీగా ఉన్నానని, 2014 ఎన్నికల్లో జిల్లా ప్రజలు 4 లక్షలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. ఇంతకంటే గొప్ప సంతోషం నాకు మరొకటి లేదని చెప్పారు. దీనికి కారణం నా పనితీరు, నిజాయితీ, నిబద్దతే అనుకుంటున్నాని తెలిపారు.  

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *