శాయంపేట సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

ఇంటిదగ్గర కంటే ఇక్కడే బాగుంది

కేజీబీవీల్లో టిఫిన్లు, భోజనం, వసతి బాగుంది

గోవిందరావు పేట కేజీబీవీలో సభలో విద్యార్థిని మనోగతం

ఆరు నెలల్లో నూతన గదుల నిర్మాణం పూర్తి కావాలి

కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడగించాలన్న నా ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది

కేజీబీవీలను 12వరకు పెంచడం వల్ల బాల్యవివాహాలు ఆగుతాయి…విద్య అందుతుంది

ప్రైవేట్ లో కేవలం స్టేటస్ కోసం పిల్లలను చదివిస్తున్నారు

ఈసారి ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు టాప్ లేపాయి..

తెలంగాణ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేవిధంగా విద్యావకాశాలు కల్పిస్తున్నాం

‘‘తెలంగాణ తల్లిని చదువుల తల్లిగా…తెలంగాణను విద్యాకేంద్రం’’ గా చేయడమే లక్ష్యం

శాయంపేట, గోవిందరావు పేట కేజీబీవీ అదనపు గదుల శంకుస్థాపనలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

భూపాలపల్లికి మధుసూదనాచారి లాంటి ఎమ్మెల్యే ఉండడం నిజంగా నియోజక వర్గ ప్రజల అదృష్టం

కాంగ్రెస్ సన్నాసుల మాటలు విని…మంచి ఎమ్మెల్యేను నిర్లక్ష్యం చేయవద్దు

ఈ నియోజకవర్గం మరో సిద్దిపేట, గజ్వేల్ కావాలంటే అది మధుసూదనాచారివల్లే సాధ్యం

శాయంపేట సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

వరంగల్:  ‘‘ తెలంగాణ తల్లిని చదువుల తల్లిగా చేయడం, తెలంగాణను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా ’’ మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశలో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలను ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాలకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. భూపాలపల్లి జిల్లా, శాయంపేట మండలం, గోవిందరావుపేట కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కోటి 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన తరగతి గదులు, ఆఫీసు కార్యాలయానికి స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. సమావేశంలో కేజీబీవి విద్యార్థిని మాట్లాడుతూ…‘‘ గత మూడేళ్లుగా తాను కేజీబీవీలో చదువుతున్నానని, ప్రస్తుతం ఇక్కడ రోజు గ్లాసు పాలు, రాగి మాల్ట్, ఉదయం పూరి, ఇడ్లీ, నాటు రవ్వ వంటి వివిధ రకాల టిఫిన్లు, మధ్యాహ్నం పప్పు, చారు, పెరుగు, కూరలతో భోజనం, మొదటి ఆదివారం మటన్, రెండో ఆదివారం చికెన్, మధ్యలో బుధవారం కూడా చికెన్, మళ్లీ మటన్ ఇలా నెలకు నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్ పెడుతున్నారు. నెయ్యి కూడా ఇస్తున్నారు. కిట్ ఇచ్చి అందులో బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, పౌడర్, బొట్టుబిల్ల, రిబ్బన్లు, షాంపులు, కొబ్బరి నూనే, జడబ్యాండ్, హ్యాండ్ వాష్, దువ్వెన వంటి అనేక వస్తువులు ఇస్తున్నారు. నాకు ఇప్పటికే 5 యూనిఫామ్ లు ఉన్నాయి. ఇంటిదగ్గర కంటే ఇక్కడే బాగుంది’’ అని తెలిపింది. తాము చెబితే రాజకీయంగా ఉంటుందని, విద్యార్థులు చెబితే నిజాలు తెలుస్తాయని, ఇప్పటికైనా ప్రభుత్వ విద్యాలయాలు ఎలా ఉన్నాయో గుర్తించాలని అక్కడకు వచ్చిన వారిని కోరారు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా మన విద్యావిధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ పదే, పదే చెబుతుంటారని, ఆయన మార్గదర్శకత్వంలో నేడు తెలంగాణ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. ఈసారి వచ్చిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో పేపర్లు ప్రభుత్వ కళాశాలలు టాప్ లేపాయని ప్రచురించిన అంశాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ కాలేజీలు 79 శాతం ఫలితాలు సాధిస్తే..ప్రైవేట్ కాలేజీలు 69 శాతం ఫలితాలే సాధించాయని, దీనిని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కొంతమంది తల్లిదండ్రులు స్టేటస్ కోసం ప్రైవేట్ కాలేజీల్లో పిల్లలను చదివిస్తున్నారని, వాస్తవానికి అక్కడి కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఇప్పుడు బాగుందని, వసతులు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెరగాలంటే గురుకులాలు మరిన్నికావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరితే…ఆయన ఏకంగా 577 గురుకులాలను ఈ మూడేళ్లలో ఏర్పాటు చేశారని, దీనివల్ల ఎంతోమంది పేద, బలహీన వర్గాల పిల్లలకు లబ్ది చేకూరుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురుకులాల ద్వారా విద్యాప్రమాణాలు పెంచడమే కాకుండా పిల్లలకు మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇలా చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బాలికల విద్యపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేసి దానికి తనను చైర్మన్ గా చేసిందని, ఈ కమిటీ చైర్మన్ గా తాను కేజీబీవీలను ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించాలని సూచించానని, ఆ మేరకు వాటిని త్వరలో కేజీబీవీలన్నీ జూనియర్ కాలేజీలు కానున్నాయన్నారు. తన ప్రతిపాదనలు అంగీకరించి కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించడం ఎంతో సంతోషకరమన్నారు. దీనివల్ల బాల్యవివాహాలు ఆగుతాయని, ఆడపిల్లలకు ముఖ్యంగా పేదింటి ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేని వారు చదువుకునే కేజీబీవీల్లో మంచి విద్య ఇంటర్ వరకు అందుబాటులోకి వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 3000 కేజీబీవీలున్నాయని, వీటిల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, తెలంగాణలోనే 475 కేజీబీవీల్లో 1,70,000 మంది విద్యార్థినిలు చదువుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం మేరకు కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకోవడంతో, మండలానికొక కేజీబీవీ కావాలని కేంద్రాన్ని కోరడంతో కొత్తగా మనకు 84 వచ్చాయని, దీనితో గతంలో391 కేజీబీవీలుంటే…ఇప్పుడు అవి 475కు పెరిగాయని, ఇంత పెద్ద సంఖ్యలో దేశంలో ఎక్కడా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు లేవన్నారు. ఇక భూపాలపల్లిని జిల్లాగా చేయడంలో, ఈ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు శ్రమించే ఎమ్మెల్యే మధుసూదనాచారి ఉండడం నిజంగా నియోజక వర్గ ప్రజల అదృష్టంగా అభివర్ణించారు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. మధుసూదనాచారి స్పీకర్ కావడంతో అనేక పనులు, నిధులు నియోజక వర్గానికి తీసుకొస్తున్నారని, తద్వారా స్పష్టమైన అభివృద్ధి భూపాలపల్లిలో కనిపిస్తుందని చెప్పారు. ఎక్కడో ఉన్న చెంచుతండాలను చూడడమే కాకుండా ఆ చెంచులను అసెంబ్లీకి తీసుకెళ్లి చూపెట్టిన మంచి మనిషి మధుసూదనాచారి అని కొనియాడారు. అసెంబ్లీతో పాటు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు గోల్కొండను కూడా చూపెడుతున్నారని, ఇలా నియోజక వర్గ ప్రజలను పట్టించుకునే నాయకుడు మరొకరు ఉండరన్నారు. ప్రజలకు ఇంత బాగా కష్టపడే మధుసూదనాచారిని విమర్శించే నైతిక హక్కు దోపిడి, అవినీతి, అక్రమాలకు పాల్పడే కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. భూపాలపల్లితో ప్రతి ఎకరాను గోదావరి నీటితో తడపాలన్న తపన మధుసూదనాచారికి ఉందని, అందుకే స్వయంగా సిఎం కేసిఆర్ వద్ద కూర్చుని నీరు ఎలా తీసుకురావాలో చర్చిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో భూపాలపల్లిలో ప్రతి ఎకరాకు గోదావరి నీరు వస్తుందన్నారు. ఇలాంటి మంచి ఎమ్మెల్యేను ఎవరి మాటలో విని కోల్పోవద్దని కోరారు. చనువుగా ఉండే ఎమ్మెల్యేను చులకనగా చూడొద్దని, కష్టాలు తెలిసిన ఎమ్మెల్యేను కాదనుకోవద్దని, ఈసారి 70వేల మెజారిటీతో ఆయన్ను గెలిపించి నియోజక వర్గాన్ని బంగారు భూపాలపల్లిగా మార్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ నియోజక వర్గాన్ని మరో సిద్ధిపేట, గజ్వేల్ గా చేయాలంటే అది మధుసూదనాచారి వల్లే సాధ్యమని చెప్పారు. గోవిందరావుపేట కేజీబీవీకి కావల్సిన ఇతర అవసరాలుంటే వెంటనే ప్రతిపాదనలు పంపిస్తే వాటిని కూడా మంజూరు చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈ రోజు కోటి 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసిన తరగతి గదుల నిర్మాణం ఆరునెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం 14 లక్షలతో నిర్మించిన బస్టాండ్ ను, మూడు కోట్ల రూపాయలతో ఆరెపల్లిలో నిర్మించిన మార్కెట్ గోదామ్ ను స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ హరిత, స్థానిక నేతలతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *