
కరీంనగర్: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుండి పెట్టుబడులు వచ్చి అభివృద్ది జరుగుతుందని, తద్వారా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ,
ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో 40 బ్లూకోట్స్ వాహనాలను మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమం సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర్రంలో
శాంతిభద్రతలు అదుపులో ఉండేందుకు ప్రభుత్వం పోలీస్ శాఖకు పెద్దపీట వేస్తున్నదని ఇందులో భాగంగానే స్టేషనరీ ఖర్చుల విడుదల నూతన వాహనాల మంజూరు, నిర్మాణాలను చేపడుతూ పోలీసులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర్రంలో మహిళలకు భద్రత,
గౌరవం లభిస్తున్నదని పేర్కొన్నారు. కరీంనగర్ లో 500కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని అన్ని రంగాల్లోనూ జిల్లాను ప్రధమ స్ధానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు పనిచేయాలని చెప్పారు. ఆదర్శవంతమైన సమాజం నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కరీంనగర్ ఇంఛార్జి డిఐజి సి.రవివర్మ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో కమీషనర్ తీసుకుంటున్న చర్యలు అభినందినీయమన్నారు. శాంతిభద్రతలను మరింత అదుపులో ఉంచడం లో భాగంగా నిరంతరం గస్తీ నిర్వాహణకు భ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లూకోట్స్ ఏర్పాటు ద్వారా నిరంతరం నేరస్ధులపై నిఘా ఉంచడంతో పాటు శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు దోహదపడుతుందన్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బ్లూకోట్స్ బృందాలు ప్రజల ఫిర్యాదులపై సత్వరం స్పందించి చర్యలు తీసుకుంటాయన్నారు. సంఘటనా స్ధలానికి 10నిమిషాల వ్యవధిలో చేరుకుంటాయని తెలిపారు.ఈ వాహనాలకు జిపిఆర్ఎస్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక వీడియో కెమెరా, టార్చిలైట్ అందజేయడం జరిగిందని చెప్పారు. జిపిఆర్ఎస్ విధానాన్ని కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ నకు అనుసంధానం చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర్ర సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, బొడిగె శోభ, జడ్ పి ఛైర్ పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటి మేయర్ గుగ్గిళ్ళ రమేష్, ఎంపిపి వాసాల రమేష్, కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్, ఎసిపిలు జె.రామారావు, యం. రవీందర్ రెడ్డి, సి.ప్రభాకర్ లతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.