
నాడు కాంగ్రేస్ కు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న పార్టీ, కాంగ్రేస్ ను ఓడించి చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ, నేడు తెలంగాణ లో కాంగ్రేస్ పార్టీకి మద్దతు ఇచ్చే దుస్ధితికి చేరుకుంది. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రేస్ తో ఢీ అంటే ఢీ అన్న తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ దాటికి తట్టుకోలేమని తెలిసి ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్ధికి మద్దతు ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం గత ఎన్నికల్లో పరాజయమే కారణంగా కనిపిస్తోంది.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో, హైద్రాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రతి పక్షాల అడ్రస్ ను గల్లంతు చేసింది. దీంతో దిక్కు తోచని కాంగ్రేస్, టిడిడపి, వైసిపిలు, పాలేరు ఎన్నికల్లో ఏకమై ఒకే అభ్యర్ధిని పోటీకి దించుతున్నాయి. అయినప్పటికి తెలంగాణ రాష్ట్ర్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర రావు గెలుపు ధీమాతో ఉన్నారు. అయితే తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని స్వర్గీయ రాం రెడ్డి వెంకటరెడ్డి సతీమణి పాలేరు కాంగ్రేస్ అభ్యర్ధి సుచరితా రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు.
దీనిపై కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాలేరు లో తుమ్మల నాగేశ్వర రావు పోటీ ఖాయమనే చెప్పవచ్చు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టీ విక్రమార్కుల అభ్యర్ధనల మేరకు తాము పాలేరు లో పోటీ చేయడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి లు ప్రకటించారు. అంటే కాంగ్రేస్ టీడీపీ మద్దతు అనివార్యం అయింది.
ఇక వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ సైతం కాంగ్రేస్ కు మద్దతు ప్రకటించింది. తెలంగాణ లో టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతున్నాయి. మున్ముందు కూడా ఇదే పరిస్థిది కొనసాగవచ్చు. -అరక