
9 ఆగస్టు, 2018 న వ్యవసాయ పరిశోధన స్థానం, రాజేంద్ర నగర్, హైదరాబాదులో వరివాటే యంత్రాల ప్రదర్శన, క్షేత్ర స్థాయిలో యంత్రాలతో వరినాటు ప్రదర్శన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి , వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్., ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప సంచాలకులు డా. ప్రవీణ్ రావు, ఉద్యాన శాఖ కమీషనర్ ఎల్. వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వివిధ కంపెనీలు ప్రదర్శించిన వరినాటే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలిథిన్ షీట్ పై నారుమడి పెంచడం, వివిధ కంపెనీల వరినాటే యంత్రాలను మీకు చూపిస్తున్నామని వ్యవసాయ మంత్రి రైతులకు తెలియజేసారు. వరినాటే యంత్రాలలో మనిషి నడిపేవి, మనిషి తోసే యంత్రాలు రెండు రకాలు ఉన్నాయన్నారు. రాను రాను వ్యవసాయంలో ఎదురవుతున్న కూలీల కొరత దృష్టిలో ఉంచుకొని దూరదృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ యంత్రాలను ప్రధానంగా వరి ఎక్కువగా సాగవుతున్న ప్రాంతాలలోనూ, ప్రాజెక్టుల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలోనూ అందిస్తామని మంత్రి అన్నారు. ఫలానా యంత్రాలు తీసుకోండని మా నుంచి ఎటువంటి సిఫారసు ఉండదని, రైతులు పరిశీలించి తాము ఆచరణలో మంచివని భావించిన యంత్రాలను మేము సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తామని వ్యవసాయ మంత్రి అన్నారు. ఈ వరినాటే యంత్రాల పద్ధతిలో వరి విత్తనం చాలా ఆదా అవుతుందని, అలాగే 10 రోజులు ముందుగానే నాటు వేయడం వలన మొక్కలు బలంగా ఎదగడమే కాకుండా పిలకలు బాగా వేస్తాయని అన్నారు. అంతేకాకుండా సమయం ఆదా అవుతుందని అన్నారు. తర్ఫీదు పొందిన, అనుభవం గలిగిన వారు ఒకరోజులో నాలుగైదు ఎకరాలనుంచి 10 ఎకరాల వరకు నాటు వేసుకోవచ్చని అన్నారు.
ఒకేసారి నాటు వేయడం వలన కోతలు కూడా ఒకేసారి చేపట్టవచ్చని మంత్రి తెలియజేసారు. అంతేకాకుండా తగిన విత్తే దూరం పాటించడం వలన వరిలో యంత్రాల సహాయంతో కలుపు, ఇతర యాజమాన్య పనులను సులభంగా చేసుకోవచ్చని మంత్రి అన్నారు. తర్వాత వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో రైతులు, వ్యవసాయ అధికారులతో వ్యవసాయ మంత్రి సమావేశమయ్యారు. వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేసారు. చాలా మంది రైతులు వరినాటే యంత్రాలపై తమ సంతృప్తిని, ఆసక్తిని వ్యక్తం చేసారు. వీలైనంత ఎక్కువ సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ, యాదాద్రి, వరంగల్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అలాగే మహీంద్ర, కిసాన్ క్రాప్ట్, యాన్మార్, కుబోట అగ్రికల్చర్ మిషనరీ ఇండియా ప్రై. లిమిటెడ్, వర్షప్రియ అగ్రోటెక్ ప్రై. లిమిటెడ్, వి.ఎస్.టి. టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులు వివిధ రకాల వరి నాటే యంత్రాలను ప్రదర్శనలో ఏర్పాటు చేసారు. క్షేత్ర స్థాయిలో దమ్ము చేసిన మడిలో వరినాట్లు వేసి చూపించారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వరినాటు యంత్రాన్ని నడిపి పరిశీలించారు.