వైద్యాధికారులు నిర్ధేశిత లక్ష్యాలు సాధించాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్: వైద్యాధికారులు నిర్ధేశిత లక్ష్యాలు సాధించాలని, లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖపై ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఎస్పిహెచ్ వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రసవాలు లక్ష్యం మేరకు చేయాలని, ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అన్నారు. కుటుంబ నియంత్రణ లక్ష్యం 21000 కాగా, ఇప్పటి వరకు 16000 చేశారని, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి లక్ష్యం పూర్తిచేయాలన్నారు. మాతా, శిశు నమోదుల ప్రక్రియ పూర్తిచేయాలని, దీనితోనే హైరిస్క్ ప్రసవాల వివరాలు తెలిసి మాతా మరణాల నివారణ సాధ్యమని, పిల్లలందరికి సమయం ప్రకారం టీకాలు, వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ అన్నారు. అత్యవసర మందులు, సర్జికల్
ఐటమ్ ల కొరత వున్నచో ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఆరోగ్య కేంద్ర భవనాలు, నర్సింగ్ స్కూల్ పురోగతి, వివిధ ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై సమీక్షించారు. నిర్మాణాలకు స్దల విషయమై వెంటనే ప్రతిపాదనలుపంపాలని, స్ధానిక తహసిల్దార్లతో స్ధల కేటాయింపు చేయిస్తామని కలెక్టర్ అన్నారు. వివిధ పధకాలు, పద్దుల క్రింద కేటాయించిన నిధులు, ఖర్చులపై సమీక్షించారు. నిధుల దుర్వినియోగం సహించేదిలేదన్నారు. ప్రజల సేవలపరంగా రాష్ట్ర్రంలోనే కరీంనగర్ జిల్లాను ప్రధమంగా నిలపాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 21న చేపట్టనున్నరెండో విడత పల్స్ పోలియో ఏర్పాట్లపై సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 0-5 సంవత్సరాల వయస్సు గల 438439 పిల్లలను గుర్తించినట్లు, మొత్తం 2840 కేంద్రాలలో పట్టణ పరిధిలో 425, గ్రామీణ పరిధిలో 2415 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు 86 మొబైల్ బూత్ లు, 44 ట్రాన్సిస్ట్ టీంలు ఏర్పాటుచేసి, 284 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు, 370 వాహనాలను అద్దెకు తీసుకొన్నట్లు, 360 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ఈ ప్రాంతాలలో గుర్తించి ఈ ప్రాంతాలలో 3488 మంది 0-5 వయస్సు గల పిల్లలు వున్నట్లు కలెక్టర్ తెలిపారు. వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేసి, రాష్ట్ర్రంలోనే కరీంనగర్ జిల్లాకు గుర్తింపు తేవాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో కరీంనగర్ మునిసిపల్ కమీషనర్ కృష్ణ భాస్కర్, అదనపు సంయుక్త కలెక్టర్ డా.ఏ.నాగేంద్ర, జడ్పి సిఇవో సూరజ్ కుమార్, ఇంచార్జి జిల్లా వైద్యాధికారి డా.రాజేశం, డిసిహెచ్ వో డా. అశోక్ కుమార్, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఎస్ పిహెచ్ వోలు, మునిసిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *