వైఎస్ ఆర్ గురించి భాస్కర్ శర్మ ఏం చెప్తున్నారో తెలుసా….

పని ప్రజల కోసమే! పార్టీల కోసం కాదు… డాక్టర్ వైఎస్‌ఆర్‌కు ఆంతరంగిక కార్యదర్శిగా సేవలందించారు భాస్కర శర్మ. వైఎస్‌ఆర్‌ను, ఆయన పనితీరును దగ్గరగా చూసిన వ్యక్తి కూడా భాస్కర్ శర్మ అని అనటంలో అతిశయోక్తి ఏమి లేదు. వైఎస్‌ఆర్ వర్థంతి సందర్భంగా భాస్కరశర్మ పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి.

ఆయన లక్ష్యం పార్టీలు కాదు, ప్రజలే. గ్రామ సర్పంచ్ స్థాయి వాళ్లు ‘తాను ఇతర పార్టీ మద్దతుతో గెలిచానని, ఎమ్మెల్యే తమ గ్రామానికి అవసరమైన పనులు చేయట్లేద’నేవారు. సార్ వారి భుజంతట్టి ‘‘ఆయనకు నేను చెప్తాలే’’ అంటూ వారు అడిగిన చెరువు, రోడ్లు వెంటనే శాంక్షన్ చేసేవారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు పనుల ప్రతిపాదన పత్రాలను సెక్షన్‌లో ఇచ్చి వెళ్లినా కూడా ఆయన వెంటనే శాంక్షన్ చేసేవారు. ‘మనం చేసే పని ప్రజల కోసం. పార్టీల కోసం కాదు శర్మా’ అనేవారు.

చూడడానికే వచ్చేవాళ్లు!
ఆయన హయాంలో సిఎం క్యాంపు ఆఫీసు ఎప్పుడూ జనంతో నిండి ఉండేది. సహాయం కోసం వచ్చేవారితోపాటు సార్‌ను చూడాలని వచ్చేవాళ్లు కూడా చాలామంది ఉండేవారు. ఓసారి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నుంచి పదిమంది మహిళలు వచ్చారు. అంతా పనులు చేసుకుని జీవించేవాళ్లే. వారి కుశలం అడిగి ఏ పని మీద వచ్చారన్నారాయన. ఆశ్చర్యంగా వాళ్లంతా ఒకటే మాట… ‘‘పనేం లేదు. మిమ్మల్ని చూద్దామని వచ్చాం’’ అన్నారు. వారిని ఓ పక్కన కూర్చోమని… మిగిలిన వారందరి పనులు పూర్తయిన తర్వాత ఆ మహిళల దగ్గరకు వచ్చి వారి కుటుంబ వివరాలు, పిల్లల యోగక్షేమాలను పరామర్శించారు. వారికి క్యాంపు ఆఫీసులో భోజనం పెట్టి, తలా ఐదువేలిచ్చారు. డబ్బు తీసుకోవడానికి వాళ్లు సంశయించడంతో ‘‘ఆడపడుచులు వస్తే అన్న ఒట్టి చేతులతో పంపించవచ్చా. చీర కొనుక్కోండి’’ అంటూ వారి చేతిని తెరిచి ఆయనే చేతిలో పెట్టారు.

వాయిదా నచ్చదు!
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్షంతో హెలికాప్టర్ ప్రయాణించే పరిస్థితి లేదు. ‘‘పేదవాళ్ల కోసం అది చేస్తాం ఇది చేస్తాం- అని హామీలిచ్చాం. వాయిదా వేస్తే… ఈ రోజు బియ్యం పథకం మొదలవుతుందని ఎదురు చూసిన వాళ్లంతా నిరాశ పడతారు శర్మా! క్యాంప్ ఆఫీస్‌కి బియ్యం తెప్పించండి, బియ్యం కావాలనే వాళ్లను రమ్మని చెప్పండి. పథకాన్ని ఇక్కడే ప్రారంభిద్దాం. సేమ్ టైమ్ రాష్ట్రమంతా అమలులోకి వస్తుంద’’న్నారు. అలాగే చేశారాయన.

‘రిలీఫ్’ ని మించిన రిలీఫ్
ఆరోగ్యశ్రీ రాకముందు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదవాళ్ల వైద్యానికి డబ్బిచ్చేవారు. అనారోగ్యాన్ని బట్టి 35 వేలు, 50 వేలు, గరిష్టంగా 70 వేల వరకే ఉండేది. సహాయం కోరి వచ్చిన వారి మెడికల్‌రిపోర్టుల ఎస్టిమేట్ చూస్తే చాలా కేసుల్లో లక్షా ముప్పై వేలకు తక్కువ ఉండేది కాదు. వచ్చిన వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన చేయగలిగినంత సహాయం చేసేవారు. సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి 70 వేలు శాంక్షన్ చేసి, హాస్పిటల్‌తో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పించేవారు. దారిఖర్చులకు తన సొంత డబ్బు ఇచ్చి పంపేవారు. అలాంటివి వారానికి రెండయినా ఉండేవి.

స్నేహంగా ఉండేవారు
ఆయన అధికారులతో స్నేహంగా ఉండేవారు. కట్‌త్రోట్ ధోరణి ఉండేది కాదు. వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడిన సందర్భం లేదు. ఆయన హయాంలో ఉద్యోగులు సంతోషంగా పని చేశారు తప్ప భయపడుతూ ఉద్యోగం చేయలేదు. ఎవరూ కుటుంబాలను మిస్ కాకూడదనేవారు. ఆయనకు వేకువనే నిద్రలేచే అలవాటు ఉన్నప్పటికీ అధికారులను అంత పొద్దునే రావద్దనే వారు. సాయంత్రం ఐదున్నర తర్వాత ఎవరినీ ఉండవద్దనే వారు. అత్యవసరమైతే ఫోన్ చేస్తాను. ఇళ్లకు వెళ్లండి అనేవారు. ఆయన ఉన్నంత కాలం ఆ సంప్రదాయం కొనసాగింది.

జీవించి గెలవాలి!
ఓ రోజు… క్యాంపు ఆఫీసు నుంచి సెక్రటేరియట్‌కు వెళ్లడానికి కారెక్కబోతుండగా పోలీసులు తడిదుస్తులతో ఉన్న ఓ అమ్మాయిని తీసుకొచ్చి హుస్సేన్‌సాగర్‌లో దూకిందని చెప్పారు. ‘‘ఆ అమ్మాయికి కాఫీ తాగించి మన కాన్వాయ్‌లో ఆఫీసుకు తీసుకురండి’’ అని ఆయన కారెక్కారు.
* ఆఫీసుకెళ్లగానే ఆమెను దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకుని ‘‘నీకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది తల్లీ’’ అని అనునయంగా అడిగారు. ఆ మాత్రం ఆదరణకు ఆ అమ్మాయి ఒక్కసారిగా భోరుమన్నది. అప్పటి వరకు మౌనంగా చెంపల మీద జారిపోతున్న కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. రెండేళ్ల కిందట ఒక కుర్రాడు ప్రేమించానని దగ్గరయ్యాడని, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి పారిపోయాడని, ఆచూకీ లేదని, తాను బతకడం వృథా అని ఏడుస్తూ ముఖాన్ని చేతుల్లో దాచుకుంది. ఆ కుర్రాడి వివరాలు చెప్తే వెతికించి, తెచ్చి పెళ్లి చేస్తానన్నారాయన. అతడు ఉత్తరాదివాడని, ఫోన్ నంబరూ లేదని చెప్పింది.

* అప్పుడాయన ఒక్కక్షణం ఆగి… ‘‘రెండేళ్ల ప్రేమ, ప్రేమించానని మోసగించిన వాడు దూరమైనందుకు ప్రాణం తీసుకోవాలనుకున్నావు. నీళ్లలో దూకేముందు నిన్ను కని, ఇరవై ఏళ్లు పెంచి ప్రయోజకురాలిని చేసిన తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నావా? నువ్వు చనిపోతే… నిన్ను కళ్లలో పెట్టుకుని చూసుకున్న తల్లిదండ్రులు ఎలా బతకాలి? ఈ జీవితం నీది. ఓడిపోయి చనిపోకూడదు. నువ్వు జీవించి గెలవాలి. మీ అమ్మానాన్నల గుండెలు నిండేలా జీవించాలి. అతగాడు పరిచయం కాకముందు నువ్వు సంతోషంగా జీవించావు. అతగాడు కనిపించకుండా పోయినా అలాగే జీవించగలగాలి. అయినా మోసగాడి కోసం జీవితాన్ని అంతం చేసుకుంటావా?’’ అని ఆ అమ్మాయి కన్విన్స్ అయ్యే వరకు మాట్లాడారు. ఆ అమ్మాయి అడ్రస్ మా రికార్డుల్లో రాయించి, వాళ్లూరికి చేర్చాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఆ అమ్మాయికి కొంత డబ్బిచ్చి పంపించారు.

చదువు ఆగిపోకూడదు
నూజివీడు త్రిబుల్ ఐటిలో మాట్లాడుతున్నప్పుడు ప్రియాంక అనే అమ్మాయి లేచి, కార్పెంటర్‌గా తండ్రికొచ్చే కొద్దిపాటి రాబడితో కష్టంగా బతుకుతున్నామని, మీ వల్లనే ఇంత పెద్ద విద్యాసంస్థలో చదువుకోగలుగుతున్నానని కృతజ్ఞత నిండిన కంఠంతో చెప్పింది. ‘డబ్బు లేదని ఎవరి చదువూ ఆగిపోకూడదు. చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. మీ అమ్మానాన్నలు గర్వపడాలి’ అని వై.ఎస్. చెప్పారు. 2010లో నేను వెళ్లినప్పుడు ఆ అమ్మాయి ఫైనలియర్. క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చిందని చెప్పింది. ఆ మాట వినడానికి సార్ లేరు…….

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *