
వేసవి శిభిరాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. శనివారం సనత్ నగర్ డివిజన్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో వేసవి స్విమ్మింగ్ పూల్ కు ఇటీవలనే 10 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలలకు వేసవి సెలవలు ప్రకటించిన తర్వాత వేసవి శిభిరాలను ప్రారంభించేవారని, కానీ ఈ సంవత్సరం ముందుగానే వేసవి శిభిరాలను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట, బేగంపేట స్విమ్మింగ్ పూల్ లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల శిక్షణ శిభిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో 5కోట్ల ఖర్చుతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
పార్కుల సమగ్ర అభివృద్ధికి చర్యలు..
సనత్ నగర్ నియోజకవర్గంలోని పార్కులు అన్నింటిని పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శనివారం ఉదయం సనత్ నగర్ లోని కంజర్ల లక్ష్మినారాయణ యాదవ్ పార్క్ (కె.ఎల్.ఎన్) ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, పార్క్ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి మంత్రి పార్క్ మొత్తం కలియతిరిగారు. పార్క్ లో త్వరలోనే ఓపెన్ జిమ్ నే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫాత్ వే మరమ్మత్తులు, ప్రహరీగోడ ఎత్తు పెంచే పనులను చేపట్లాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పార్క్ లో లైటింగ్ సౌకర్యం పూర్తిస్ధాయిలో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్క్ అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేసుకోవడం అభినందించదగ్గ విషయం అని మంత్రి చెప్పారు. పార్క్ లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి కాని, అధికారుల దృష్టికి కాని తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కొలను లక్ష్మి, జోనల్ కమీషనర్ రఘుప్రసాద్, డిసి శ్రీనివాస్, ఎస్ఈ మోహన్ సింగ్, స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్ రాజ్, ఎలక్రికల్ ఈఈ వేణుమాధవ్, ఉద్యానవనశాఖ అధికారి నాగిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొలన్ బాల్ రెడ్డి, ఖలీల్, లక్ష్మీనారాయణ, కొండల్ రావు, బుచ్చయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.