
కరీంనగర్, ప్రతినిధి :
కవులకు, రచయితలకు నిలయమైన కరీంనగర్ జిల్లాలో ఎన్నోరచనలు, పుస్తకాలు, కవిత్వాలు వారి నుంచి జాలువారుతూనే ఉన్నాయి.. నవ తెలంగాణ ఉదయించిన ఈ సమయంలో మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ తెలంగాణ బిడ్డకు ఉంది. ఆ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆరాచాలు, వ్యవహారాలు, తెలంగాణ చరిత్రపై రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, రచయిత అయిన వీరగోని పెంటయ్య రాసిన ‘ఊరవిశ్కెల పోరు’ పుస్తకం ఆకట్టుకుంటోంది. తెలంగాణలో తరతరాలుగా జరిగిన ఆకృత్యాలు, ఆక్రందనలు, రాజకీయ దోపిడీ, పేదరికం, పల్లెల చరిత్రలు, మానేరు నది ప్రస్థానం, నక్సలైట్ల గురించి, సర్వాయి పాపన్న గోల్కొండను జయించిన నేపథ్యం పుస్తకంలో రాశారు.. కథల సంపుటిలా ఉన్న ఈ పుస్తకంలో కరీంనగర్ కొత్త లేబర్ అడ్డా, కొత్తపాదు, ఈత, అలికిడి, గుట్టల జంపుతార్ర, ప్రకృతి పలికితే, ఎవుసం, ఎవరీ సేవకులు, కన్నెగంటి వైపే,, నిజాయితీ, ఉగ్రవాదులు, ఎన్ కౌంటర్, మందాపూర్ గట్టల్లో ఏం జరిగింది లాంటి అనేక కథలు ఈ పుస్తకంలో ఆయన పొందుపరిచారు.
పక్కా తెలంగాణ సమాచారం ఉన్న ఈ పుస్తకంను ఎంతో మంది జిల్లా రచయితలు చదివి అభినందించారు. ఆద్యంతం తెలంగాణ యాస, భాష, మాండలికంతో అద్భుతంగా రాశారు వీరగోని పెంటయ్య. ఆయన కరీంనగర్ జిల్లా వాసే.. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయి రచనల బాట పట్టారు. సర్వాయి పాపన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.