హైదరాబాద్, ప్రతినిధి : ఇది ఎవరినీ ఉద్దేశించి తీయట్లేదు అని ట్యాగ్ లైన్ తగిలించున్న ఈటీవీ జబర్ధస్త్ షోకు అయినా వివాదాలు తప్పట్లేదు.. ‘జబర్దస్త్’ కామెడీ షోలో వృత్తులను కించపర్చే విధంగా స్కిట్లు వస్తున్నాయంటూ పలు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కమెడియన్ వేణుపై ఓ సామాజిక వర్గం నేతలు దాడికి పాల్పడ్డారు. స్కిట్లలో తమ కులాన్ని అగౌరవపర్చారంటూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఫిల్మ్ చాంబర్ వద్ద ఆందోళన చేపడతుండానే అక్కడికి వచ్చిన వేణుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఇరువురిపై 509, 323, 341 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల దాడిలో గాయపడిన వేణు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మూడు పీఎస్ లలో ఫిర్యాదులు..
ఇటీవలే ఈ విషయంపై ఆ సంఘం నేతలు ఓ.యూ, హయత్‌నగర్‌తో పాటు మరో పోలీస్‌స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదులు అందాయి. జబర్దస్త్ టీం వెంటనే క్షమాపణ చెప్పాలని ఫిల్మ్ ఛాంబర్ ముందు గౌడ సంఘం నేతలు ధర్నా చేపట్టారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
హుజురాబాద్ లో ప్రయివేట్ పిటిషన్..
పది రోజుల క్రితం న్యాయవాదులను, కోర్టులను కించపర్చేవిధంగా వ్యవహారించారని కరీంనగర్ హుజురాబాద్ కోర్టులో ప్రయివేట్ పిటిషన్ దాఖలయింది. దీంతో కేసు నమోదు చేయాలని హుజురాబాద్ పోలీసులకు కోర్టు అదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాతో పాటు ప్రసార చానల్‌పై కూడా కేసు నమోదయింది. ఇప్పటికైనా వృత్తులను కించపరిచే విధంగా పాత్రలు, నాటికలు ఉండరాదని వివిధ కులవృత్తి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.