
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో విద్య విధానంపై చర్చిద్దామని, సభ్యులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రసంగిస్తుండగా మధ్యలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. విద్యకు సంబంధించి విషయంలో సభ్యుడు లక్ష్మణ్ పలు సూచనలు చేశారని తెలిపారు. గత ఏపీలో పరిస్థితులు అన్ని తెలుసే ఉంటుందని, అనేక పరిణామాలు జరిగాయన్నారు. విద్య ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయిందని, అంతేగాక కొన్ని ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించాయని పేర్కొన్నారు. ఉచిత నిర్భంద విద్య ఒవర్ నైట్ తీసుకొచ్చేది కాదని, ఆదరాబాదరగా తీసుకొస్తే సమస్యలు వస్తాయని తెలిపారు. ఉన్న టీచర్లను రేషనలైజ్ చేద్దామంటే ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, విద్యా విధానంపై సభ్యులందరం చర్చిద్దామన్నారు. ఇందులో వచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు.