విద్యార్ధులకు వేసవిలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలిః రాష్ట్ర్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య

కరీంనగర్: జిల్లాలో పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం అందజేయాలని రాష్ట్ర్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో వేసవిలో మధ్యాహ్న భోజనం, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించే ఆశ్రమ పాఠశాలల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వం వేసవి
సెలవులలో విద్యార్ధులకు మధ్యాహ్న భోజన ఏర్పాటుకు చర్యలు తీసుకుందని, దీన్ని జిల్లాలో అమలు చేయాలన్నారు. మొదటి విడతగా మండలానికి ఒకటి చొప్పున ఆశ్రమ పాఠశాల/హస్టళ్లను గుర్తించి వంద మంది విద్యార్ధులకు తక్కువ కాకుండా సెలవు లేకుండా, వారంలో ఏడు రోజులు భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక మండలంలో బాలురకు, ప్రక్క మండలంలో బాలికలకు ఏర్పాట్లు చేయాలని, విద్యార్ధులు ఎక్కువ మంది వున్నచో వీటి సంఖ్యను పెంచాలన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు, మౌళిక వసతులు వున్న వాటిని గుర్తించి ఎంపిక చేయాలన్నారు. ఇప్పటి వరకు వున్నఏజెన్సీ ద్వారానే ఇట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8.30 వరకు విద్యార్ధులను రప్పించి ఉదయం 10.30 గంటలకు భోజన ఏర్పాట్లు చేసి, ఉదయం 11 గంటలలోపు పంపించివేయాలన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులను సంప్రదించి ఆశ్రమ పాఠశాల/హస్టళ్లకు రాదలచుకునే పిల్లల వివరాలు సేకరించి, సుమారు విద్యార్ధుల సంఖ్య; ఖర్చు వివరాలు తయారుచేయాలన్నారు. సామాగ్రి ముందుగానే అందజేసి చర్యలు చేపడతామని అన్నారు. తప్పిదాలకు తావులేకుండా, పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి 221 ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించనుందని, ఇందులో 100 సాంఘీక సంక్షేమ శాఖ, 50 గిరిజన సంక్షేమ శాఖ, 71 అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతాయని, ఇట్టి పాఠశాలలకు తాత్కాలికంగా అద్దె/ప్రభుత్వ భవనాల ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత భవనాల నిర్మాణాలకు స్దల సేకరణ చేపట్టాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా
ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ పూర్తయి, జిల్లాలకు పంపిణి చేసినట్లు, ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హస్టళ్లకు నిర్ణీత సమయంలోగా అందజేయాలన్నారు. వీడియో కాన్పరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, మండలాలకి ఒకటి చొప్పున గుర్తించిన ఆశ్రమ పాఠశాలలు/హస్టళ్లలో ఈ నెల 25 లోగా ప్రతిరోజు మధ్యాహ్న భోజన ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలను ఉదయం 8.30 గంటల వరకు రప్పించి ప్రత్యేక తరగతులు, లేఖలు వ్రాయటం, ఉపన్యాసాలు, వ్యాకరణంలో శిక్షణతో పాటు, ఆటలు, పెయింటింగ్, నాట్యంలో శిక్షణ ఇస్తామని, వీలును బట్టి విహర యాత్రలకు తీసుకెళ్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించే ఆశ్రమ పాఠశాలలకు తాత్కాలికంగా లభ్యతను బట్టి ప్రభుత్వ భవనాలు, లేనిచో అద్దె భవనాలలో ప్రారంభింస్తామని, శాశ్వత భవనాలకు స్దల సేకరణ చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి, సాంఘీక సంక్షేమ శాఖ డిడి యాదయ్య, వయోజన విద్యా డిడి జయశంకర్, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ డిడి మంజుల, మైనారిటి కార్పోరేషన్ ఇడి హమీద్, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి మహ్మద్ అలి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *