విద్యార్థులపై పోలీసుల థర్డ్ డిగ్రీ

వరంగల్ , ప్రతినిధి : వరంగల్ లో అమాయకులైన నలుగురు విద్యార్థులపై  పోలసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ప్రత్యక్ష నరకం చూపించారు. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న విద్యార్థులు ప్రస్తుతం లేవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమయ్యారు.

ఇటీవలే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామంలో 10 రోజుల క్రితం ఓ మూగ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసుని సవాలుగా తీసుకున్న పోలీసులు తమ కర్కశత్వం ఎలా వుంటుందో విద్యార్థులపై చూపించారు. ఐనవోలుకి చెందిన హరీష్, అరుణ్, రాజు, సంపత్ అనే ఈ నలుగురు విద్యార్థులని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రెండు రోజులపాటు వేర్వేరు స్టేషన్లలోకి తిప్పుకుంటూ చిత్రహింసలు పెట్టారు. ఎలాగైనా వారిచేత నేరం ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం వర్కవుట్ కాకపోవడంతో ఆ కుర్రళ్లను ఇలా జీవచ్ఛవాలుగా మార్చేశారు.

అయితే, తనపై అత్యాచారానికి ఒడిగట్టిన అసలు నిందితుడిని ఆమె గుర్తుపట్టడంతో ఈ నలుగురు విద్యార్థులు పోలీసుల చిత్రహింసల నుంచి బయటపడగలిగారు. అసలు విషయం తెలిసిన తర్వాత నిందితుడైన 48 ఏళ్ల వెంకటస్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు అప్పుడేదో ఘనకార్యం చేసినవాళ్లలాగా ఇలా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పుకున్నారు. అదే సమయంలో తమ చేతిలో ప్రత్యక్ష నరకం చూసిన విద్యార్థులని అసలు విషయం బయటికి చెప్పొద్దంటూ హెచ్చరించారు. ఒకవేళ ఈ విషయం బయటికి పొక్కితే మళ్లీ థర్డ్ డిగ్రీ తప్పదంటూ బెదిరించి మా నోరు నొక్కే ప్రయత్నం చేశారని బాధిత విద్యార్థులు వాపోతున్నారు. అయితే, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. వీళ్లు పోలీసులా లేక రౌడీలా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. విద్యార్థుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుని బాధితులని ఆదుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.