
సమాజ సేవకులను విస్మరించిన గత ప్రభుత్వాలు
నవాబుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
త్వరలో నవాబుపేట మార్కెట్ కమిటీ నియామకం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
గత ప్రభుత్వాలు సమాజ సేవకులను విస్మరించాయని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరి జయంతి, వర్ధంతిలను ఉత్సవంగా జరుపుతున్నామన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. సమాజానికి మేలు చేసిన వాళ్ళని ఎప్పటికీ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాళ్ళందరి త్యాగ నిరతి కారణంగానే మనమీ స్థాయి, స్థానంలో ఉన్నామన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని మంత్రి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మండల కేంద్రమైన నవాబుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మార్కెట్ యార్డులో రూ.40లక్షలతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు. రూ.18లక్షలతో నిర్మించనున్న ప్రసూతి కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకుని ప్రారంభించారు. పలు సిసి రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మైసమ్మ గుడిలో పూజలు చేశారు.
అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు, జ్యోతిరావుఫూలే, జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సేవా మహారాజ్, వాల్మీకి వంటి అనేక మంది సమాజ సేవకుల జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. సమాజ సేవకులను విస్మరిస్తే, గత చరిత్రను విస్మరించినట్లేనన్నారు. వాళ్ళంతా తమ జీవితాలను సమాజం అభ్యున్నతి కోసం త్యాగం చేసిన త్యాగ ధనులని, వారి త్యాగ నిరతిని తలచుకుంటూ వారి సేవలను స్మరించుకోవడం అంత్యంత అవశ్యం అన్నారు మంత్రి. భవిష్యత్తులోనూ ఇలాంటి త్యాగ ధనులందరిని అధికారికంగా స్మరించుకుంటామని చెప్పారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అనూహ్య అభివృద్ధి జరుగుతున్నదన్నారు. గ్రామాల్లో రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత, వాటిని నీటితో నింపడం, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ సాగు, మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, వంటి సంక్షేమ పథకాలు అప్రతిహతంగా అమలు అవుతున్నాయని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. ఆయా పథకాలను సోదాహరణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ, ఎంపిపి, ఎంపిటీసీ, సర్పంచ్‌లు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.