వారం లోగా తెలంగాణ అంతట ధాన్యం కొనుగోలుకేంద్రాల ఏర్పాటు: హరీశ్ రావు,ఈటెల రాజేందర్

 

 

24 గంటల్లో క్రయ విక్రయాలు జరపాలి.

 వీలైనంత త్వరగా  చెల్లింపులు చేయాలి.

 జాయింట్ కలెక్టర్లకు మంత్రులు హరీశ్ రావు, ఈటెల  ఆదేశాలు:

వారంలోగా రాష్ట్రంలో  అన్ని చోట్ల ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల  మంత్రులు హరీశ్ రావు,ఈటెల రాజేందర్,  ఆదేశించారు.

యాసంగి సీజన్లో వస్తున్న వరి ధాన్యం సేకరణ చర్యలపై  ఆదివారం నాడు  మంత్రులు సెక్రెటేరియట్లో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో మొతం 3076 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటివరకు 1521 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.మిగతా అన్ని కొనుగోలు కేంద్రాలను వారం లో తెరవాలని కోరారు.కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఏ రోజు కా రోజు లారీలలో ఎగుమతి చేయాలని కోరారు.

ఖాళీ గోనెసంచుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు.మొత్తం 10 కోట్ల ఖాళీ గొనె సంచులను సమకూర్చుతున్నట్టు చెప్పారు.ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాల్లో తక్షణం కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి విస్తృతంగా మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు.

ధాన్యం సేకరణ సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదులు,ఇతర సమస్యలపై   జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులకు హరీశ్ , ఈటెల  దిశా నిర్దేశం చేశారు.జాయింట్ కలెక్టర్లు ప్రతి రోజు సమీక్షించాలని ఆదేశించారు.ఎక్కడ ఏ సమస్య తలెత్తినా అక్కడికక్కడే పరిష్కరించాలని మంత్రులు అన్నారు. అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు సమకూర్చలన్నారు.

టార్పాలిన్లతో పాటు మాయిశ్చర్ మీటర్లు, తూకపు మిషన్లను రెడీగా పెట్టుకోవాలని ఆదేశించారు.  ఇక పై తాను,ఈటెల మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని చెప్పారు.మార్కెట్ యార్డు లో టాయిలెట్లు,రక్షిత తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఉండాలని ఆ సౌకర్యాల నిర్వహణ తీరు తెన్నులను నిరంతరం సమీక్షించాలని మంత్రి హరీష్ రావు కోరారు.అలాగే రైతుల విశ్రాంతి గృహం ఉన్న చోట్ల వాటి నిర్వహణ ను కూడా పర్యవేక్షించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రికార్డు స్థాయిలో 21 లక్షల 64 వేల ఎకరాల్లో వరి సాగు జరిగిన విషయాన్ని  మంత్రులు గుర్తు చేశారు. భూమికి బరువయ్యే రీతిలో బంపర్ దిగుబడి వస్తోందని  దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు  వస్తోందని మంత్రులు తెలిపారు.ఇంత భారీ స్థాయిలో ధాన్యం మార్కెట్లకు వస్తున్నందున రైతులకు కనీస మద్దతు ధర కన్నా తక్కువ రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయ మార్కెట్ కు వచ్చిన రైతు తన పంటను 24 గంటలలోనే అమ్ముకుని తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.వీలైనంత త్వరగా  వారికి చెల్లింపులు జరగాలని ఆదేశించారు.  ఆన్ లైన్ చెల్లింపులలో ఎలాంటి జాప్యం చేయరాదని వారన్నారు.కందుల కొనుగోళ్లలో రైతులకున్న  బకాయిలు  వెంటనే  చెల్లింపులు జరపాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారూ. సాగునీరు యాసంగి లో పుష్కలంగా అందించినందున  ఎకరానికి 35 క్వింటాళ్ల కు పైగా ధాన్యం  దిగుబడి రానుందని మంత్రులు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో వర్ని ప్రాంతంలో ఎకరానికి 66 బస్తాలు ధాన్యం దిగుబడి వచ్చిన విషయాన్ని ఆ జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్సు లో మంత్రులకు తెలిపారు.

ధాన్యం సేకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మీడియాలో  కధనాలు రాకుండా చూసుకోవాలని,రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని హరీష్రావు, ఈటెల ఆదేశించారు.కొనుగోలు కేంద్రాలలో హమాలీలు, లారీలు ఇతర సనస్యలేవీ రాకుండా చూడాలని కోరారు. మార్కెట్ లలో, కొనుగోలు కేంద్రాలలో రైతులకు తాగునీటిని ఏర్పాటు చేయాలని,వారికి నీడ కల్పించేందుకు టెంట్లు నెలకొల్పాలని ఈటెల సూచించారు.జాయింట్ కలెక్టర్లు ప్రతిరోజు ధాన్యం సేకరణ పరిస్థితిని సమీక్షించాలని, కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని  జాయింట్ కలెక్టర్ లను మంత్రులు హరీష్రావు, ఈటెల  ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్సులో పౌరసరఫరాల కమిషనర్ సి.వి.ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్  డాక్టర్  జగన్మోహన్ , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, తెలంగాణ రైస్ మిల్లర్ల సంఘం కార్యదర్శి మోహన్ రెడ్డి  , జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలు, మార్కెటింగ్, ఎఫ్.సి.ఐ. తదితర సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *