
హైదరాబాద్ , ప్రతినిధి : నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఏపి సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ఆ పనులను మొదలు పెట్టింది. దీనికోసం మూడురోజులు పర్యటించి నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ అందిస్తామని తెలిపింది. మరింత సమాచారం కోసం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రిన్సిపల్ సెక్రటీరీలు, కమిషనర్లతో సమావేశమయింది.
రెవెన్యూ రికార్డుల సేకరణ..
500 సంవత్సరాల రెవెన్యూ రికార్డులు కావాలని సింగపూర్ బృందం అధికారులను కోరింది. గతంలో భూకంపాలు, వరదలు వచ్చిన వాటి వివరాలు, అక్కడ పండుతున్న పంటల వివరాలను అధికారుల నుంచి తీసుకుంది. రాజధానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సింగపూర్ బృందం కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
జనవరి 19 నుంచి 23 వరకు శిక్షణ..
సింగపూర్‌కు రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందం వెళుతోంది. 30 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలోని వారికి జనవరి 19 నుంచి 23వరకు అక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాబోయే అయిదేళ్లలో రిటైర్ అయ్యేవారినే బృందంలో పంపాలని సింగపూర్ టీం కోరినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే రాజధాని నిర్మాణపు మాస్టర్ ప్లాన్ ఆరునెలల లోపే ఇస్తామని సింగపూర్ ప్రతినిధి బృందం అంటోంది. మొత్తం మీద ఏపి వాసులు కలలు కంటున్న అద్భుత రాజధాని అనుకున్న గడువులోపే కళ్ల ముందు సాక్షాత్కరింప చేసేందుకు ఏపి ప్రభుత్వం, సింగపూర్ సిద్ధమవుతోంది.