వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ ప్రజలకు
సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వారంలోనే రెండుసార్లు అధికారులు, మంత్రులతో సమీక్ష చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కేరళలో వున్న కేసీఆర్‌… అక్కడ వుండగానే వాటర్ గ్రిడ్‌పై మరోసారి సమావేశం కావాలని ఆదేశించారు. దీంతో వెంటనే క్యాంపు కార్యాలయం ముందున్న హోటల్‌లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జోగురామన్న, తుమ్మల నాగేశ్వరరావు, మహమూద్ అలీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. నీటి పంపుల నిర్వహణకు ఎక్కడెక్కడ ఎంత విద్యుత్ అవసరమో… దానికి ఎక్కడి నుంచి విద్యుత్ అందించవచ్చనే అంశంపై చర్చించేందుకు… విద్యుత్‌ శాఖ అధికారులు, మంత్రి లక్ష్మారెడ్డిని సమావేశానికి ఆహ్వానించారు.

వాటర్ గ్రిడ్ పనుల్లో సాంకేతిక పరిజ్ఞానం
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సీఎం నేరుగా సమావేశానికి వెళ్లారు. వాటర్ గ్రిడ్ అలైన్‌మెంట్, నీటి వనరుల గుర్తింపు, నీటి శుద్దికేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తింపు అంశాలపై చర్చించారు. వాటర్ గ్రిడ్ పనుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకం కింద కృష్ణా వాటర్‌ను నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు పూర్తిస్థాయి తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

వాటర్ గ్రిడ్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తాం: కేటీఆర్
వాటర్ గ్రిడ్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫారెస్ట్‌, ఇరిగేషన్, ఎనర్జీ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, అడ్మినిస్ట్రేషన్‌ శాఖల సమన్వయంతో ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. వాటర్ గ్రిడ్‌ కోసం ఇప్పటికే 29 నీటి వనరులు గుర్తించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అనుమతులు సైతం ఒకేసారి ఇస్తామన్న ఆయన రహదారుల వెంట పైప్‌ లైన్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ తీసుకువస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.