
ఓ వైపు కుండపోత వర్షం…మరో వైపు జర్నలిస్టుల నినాదాలతో కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మీడియా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు) పిలుపు మేరకు శుక్రవారం నాడు విద్యానగర్ లోని కేంద్ర డిప్యూటీ చీఫ్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఆధ్వర్యంలో జరిగిన ధర్నా విజయవంతమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగర నలుమూలల నుండి జర్నలిస్టులు ఈ ఆందోళనకు తరలి వచ్చారు. ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి ఐజేయు అధ్యక్షులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధాలను అనుసరిస్తున్న మోదీ సర్కారుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభంగా గుర్తింపు పొందిన మీడియా వృత్తిని ఇతర పరిశ్రమలతో సమకట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీయుడబ్ల్యుజె సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి ప్రసంగిస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలుచేసే విధంగా మోడీ సర్కారు అవలంభించడం సిగ్గుచేటన్నారు. దేశానికి ఏదో ఉద్దరిస్తారని ప్రజలు పట్టం కడితే, ప్రజా వ్యతిరేక చర్యలను అనుసరిస్తూ తీరని ద్రోహం తలపెడుతున్నారని ఆయన విమర్శించారు. దేశంలో పౌరులు మాట్లాడే హక్కును, స్వేచ్ఛను కోల్పోయే విధంగా మోడీ సర్కారు ప్రవర్తించడం సహించారనిదన్నారు.
జర్నలిస్టుల వేతనాలకు సంబంధించి 1958లో ఒక ప్రత్యేకమైన వేజ్ బోర్డును ఏర్పాటు చేసి పాత్రికేయ వృత్తికి గల ఔన్నత్యాన్ని గత ప్రభుత్వాలు చాటితే, బిజెపి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ చర్యను వెంటనే ఉపసంహ రించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, దేశంలో మీడియా స్వేచ్ఛను హరించడమంటే ఏకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా స్వతంత్రంగా పనిచేయడం మోడీ సర్కారుకు ఇష్టం లేనందువల్లే దాన్ని హరించే చట్టాలను తీసుకువస్తున్నట్లు ఆయన ఆరోపించారు. యూనియన్ సీనియర్ నాయకులు కె.అమర్ నాథ్, ఎం.ఏ.మాజీద్ లు మాట్లాడుతూ, వేజ్ బోర్డు వేతనాలిస్తే పత్రికలను మూసుకోవాల్సి వస్తుందంటూ దుష్ప్రచారం సాగిస్తున్న మీడియా యాజమాన్యాలకు బిజెపి ప్రభుత్వం వత్తాసు పలకడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, దేశపాక స్వామి, డి.జి.శ్రీనివాస్ శర్మ,
హెచ్ .యు.జె అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగా శంకర్ గౌడ్, నాయకులు సుధాకర్, చారీ, జునేద్ ముల్తానీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్యామసుందర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.