
వరంగల్ , ప్రతినిధి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో తీరిక లేకుండా గడిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ చేరుకున్న ఆయన.. జిల్లా కేంద్రంలోని తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. కాశీబుగ్గ లక్ష్మీపురంలోని మురికివాడలు పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అంబి కొమురం, అంబి సమ్ములు గుడిసెలకు వెళ్లారు. 20 నిమిషాలకు పైగా అక్కడే వుండి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యల గోడు వెళ్లబోసుకున్నారు. వాటన్నిటిని సావధానంగా విన్న సీఎం… అర్హులైన వారికి రెండు రోజుల్లో పెన్షన్, రేషన్ కార్డులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
వన్ ప్లస్ వన్ ఇండ్ల నిర్మాణం
నగరంలోని అన్ని మురికి వాడల్లో గుడిసెలు తొలగించి వన్ ప్లస్ వన్ ఇండ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కో ఇంట్లో రెండు బెడ్ రూములు, హాల్, కిచెన్, రెండు బాత్ రూమ్లు ఉండేలా చూస్తామని తెలిపారు. సీఎం పర్యటనలో ఆయన వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం రాజయ్య, పలువురు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. కేసీఆర్ ఇవాళ వరంగల్లోనే బసచేసి రేపు ఉదయం భూపాల్పల్లికి హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వేకు వెళ్తారు.