వరంగల్ అభివృద్ధికి కొత్త మాస్టర్ ప్లాన్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కూడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కూడా వైస్ చైర్మన్ ఎన్.రవికుమార్, పీవో ఇ.అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. మాస్టర్ ప్లాన్ త్వరగా ఆమోదం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ కు సూచించారు. ‘ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా వరంగల్ మహా నగరాన్ని అభివృద్ధి చేసేలా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నాం. గతంలో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్ 1971ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 తయారైంది. వరంగల్ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంది. మూడు జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 1800 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంది. గత మాస్టర్ ప్లాన్ తో పోల్చితే 20 రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. టెక్స్ టైల్ పార్క్, టూరిజం హబ్… వంటి అన్ని అంశాలతో వరంగల్ ఎకనామిక్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ప్లాన్ తయారు చేశాం. కూడా పరిధిలో ఉన్న 2 వేల చెరువులను పరిరక్షించే లా మాస్టర్ ప్లాన్ ఉంది. పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు… ఇలా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు అమలవుతాయి. ప్రజల సూచనలు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మార్పులతో తుది ప్లాన్ సిద్ధం చేశాం. ఎన్జీవోలు, పౌరుల నుంచి వచ్చిన దాదాపు 3500 ఫిట్ ల్ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నాం. మాస్టర్ ప్లాన్ ఆమోదం కోసం ఈ ఏడాది జూన్ లో  ప్రభుత్వానికి పంపించాం. త్వరగా ఆమోదం పొందేలా మున్సిపల్ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలి ‘ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. మున్సిపల్ శాఖ  పూర్తిగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. ఈ సమావేశానికి ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చైర్మన్, అధికారులతో సమీక్షించారు.

errabelli dayakar rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *