వడగండ్లతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

-ఇది మిషన్ కాకతీయ కాదు.. ‘కల్వకుంట్ల మిషన్’ -దోచుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు – కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం -టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్

కరీంనగర్, ప్రతినిధి : వడగండ్లు, ఆకాల వర్సాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ కు వచ్చిన వారు డీసీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులను అరిగోస పెడుతున్న సర్కారు బాగుపడదని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీపాద ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో 60వేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ను లండన్ చేస్తానన్న కేసీఆర్ .. అధ్వానంగా తయారైన ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ మాటలు కోటలు దాటుతాయని పని మాత్రం జరగదని ఎద్దేవా చేశారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా హింసిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే 5 ఏళ్లకు కాంగ్రెస్ దే అధికారం అని.. ఖబడ్డార్ పోలీస్ అంటూ హెచ్చరించారు. మిషన్ కాకతీయ పథకం దోచుకోవడానికి మొదలు పెట్టారని.. దీన్ని కల్వకుంట్ల మిషన్ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అధికారం అర్రులు చాచి గద్దెనెక్కిన టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతూ ప్రజాసంపదను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశం అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,మాజీ మంత్రి శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఆరెపల్లి మోహన్, అడ్లూరి లక్ష్మన్ కుమార్, కొమొరెడ్డి రాములు, డా. వెంకట్, ప్రవీణ్ రెడ్డి, బి. వినోద్, కౌషిక్ రెడ్డి, ముదుగంటి సురేందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, ఆకుల ప్రకాశ్, ప్యాట రమేశ్, జనక్ ప్రసాద్, వెంకట కిషన్ రావు, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *