
కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని రాష్ర్ట ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం విజయగార్డెన్స్ లో జరిగిన తెలంగాణ రాష్ర్ట ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ర్ట కౌన్సిల్ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రేపటి విద్యార్థి, దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని అన్నారు. పేద ప్రజలు పిల్లల చదువులకు అప్పులు చేసి అప్పుల పాలు కావద్దని వచ్చే ఏడాది నుంచి కెజి టు పిజి విద్యా విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇకపై ప్రైవేటు పాఠశాలల అనుమతులను తగ్గించి ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్తూరిబా బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల నిర్వహణకు నిధులు నిలిపివేసినా కూడా రాష్ర్ట ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తుందని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల్లో 6 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రభుత్వం సంవత్సరంలో 6 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. 2019లోపు అన్ని గిరిజన, లంబాడి తండాలకు, గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించుటకు వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. 2018 వరకు 24 గంటల కరెంటును అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియూ రాష్ర్ట సంఘం అధ్యక్షుడు పి వెంకట్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కె జనార్ధన్ రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ రెడ్డి, రాష్ర్టంలోని పది జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.