లిఫ్ట్,మైనర్ ఇరిగేషన్ పథకాలతో మొత్తం లక్ష ఎకరాలకు నీళ్లు – మంత్రి హరీశ్ రావు

పామిరెడ్డిపల్లి , పెద్దమందడి మండలం,  వనపర్తి జిల్లా.

మంత్రి హరీశ్ రావు: కల్వకుర్తి, భీమా లిఫ్ట్,మైనర్ ఇరిగేషన్ పథకాలతో మొత్తం లక్ష ఎకరాలకు వనపర్తి నియోజకవర్గంలో నీళ్లు పారిస్తాము.కృష్ణసముద్రానికి12 కోట్లు మంజూరు చేశాము.త్వరలో డిజైన్స్ పూర్తి చేసి నిర్మాణ పనులు పూర్తి చేస్తాము.వనపర్తి మార్కెట్ ను అభివృద్ధి పరుస్తాం. ఎక్స్పోర్టు మార్కెట్ గా ఆధునీకరిస్తాం.వనపర్తి జిల్లా కేంద్రం మినీ ట్యాన్క్ బండ్ కు ఇంకా నిధులు కేటాయిస్తాం.ఖమ్మం, యాదాద్రి జిల్లాలకు గోదావరి జలాలను ఇవ్వనున్నాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తర్వాత  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి కృష్ణా నికరజలాలను ఉపయోగిస్తాం.రైతులకు పంట పెట్టుబడి కింద రెండు పంటలకు 8 వేల రూపాయలు ఇవ్వబోతున్నాం. వేరుశెనగ రైతులకు మద్దతు ధర కోసం ప్రయత్నిస్తున్నాం.కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.తొందరపడి అమ్ముకోవద్దు.ప్రజల్లో మా ప్రభుత్వంపై నమ్మకం ఇంకా పెరుగుతున్నది.ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం గా మేము రుజువు చేసుకున్నాము.

వనపర్తి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు.

జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలను అన్ని రకాలు అభివృద్ధి చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. పెద్దమందడి వెల్టూరు గ్రామంలో రూ. 3 కోట్లతో, చిట్యాల మండలంలో రూ. 6 కోట్లతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ గోదాంను హరీష్‌రావు ప్రారంభించారు. బుద్దారం పెద్ద చెరువు నుంచి పెద్దమందడి మండలంలోని 21 గ్రామాలకు సాగునీరు అందించే బ్రాంచ్ కాలువలకు హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పామిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీష్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలోనే కరువు మండలాల్లో పెద్దమందడి మండలం ఒకటి. అలాంటి పెద్దమందడిలో కరువును తరిమేందుకు నిరంజన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు రూ. 20 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఇటీవలే ఘనపురం బ్రాంచ్ కెనాల్‌ను రూ. 180 కోట్లతో రికార్డ్ టైంలో పూర్తి చేశామన్నారు. తిండి లేకపోయిన బతుకవచ్చు కానీ నీరు లేకపోతే కష్టమవుతుందన్నారు. బీమా, కల్వకుర్తి, మైనర్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వనపర్తి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు గడ్డి మొలవని పాలమూరు జిల్లాలో ఇప్పుడు తుంగ మొలుస్తుందంటే.. నీటి ప్రవాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఈ జిల్లాలో వేరుశనగ అధికంగా పండుతుండటంతో.. ఎక్కువ మద్దతు ధర వచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఇక్కడే రాష్ర్ట ప్రభుత్వం.. వేరుశనగను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. వనపర్తి మార్కెట్‌ను అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. శంకర సముద్రం, కృష్ణ సముద్రం చెరువులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. పెబ్బేరులో రూ. 6 కోట్లతో, వనపర్తిలో రూ. 6 కోట్లతో పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు, పెద్దమందడిలో రూ. 3 కోట్లతో, ఘనపురంలో రూ. 3 కోట్లతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలను నిర్మించుకున్నామని హరీష్‌రావు వెల్లడించారు. సాగునీటి రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నికర జలాలు పాలమూరు జిల్లాకు దక్కాలన్నదే సీఎం కేసీఆర్ తపన అని హరీష్‌రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని గుర్తు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *